జనగామలో విషాదం - ఫ్లైఓవర్ పైనే గుండెపోటుతో వ్యక్తి మృతి
మోటార్ పంపు కొని తిరిగి వెళ్తుండగా అపస్మారక స్థితి - స్కూటీపైనే కుప్పకూలిన మెకానిక్
స్థానికులు CPR చేసినా ఫలితం లేకపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు
జనగామ, అక్టోబర్ 29: జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జనగామ పట్టణంలోని సిద్దిపేట రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు.
మృతుడిని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లి గ్రామానికి చెందిన బోడ లింగయ్య (51) గా గుర్తించారు. లింగయ్య బచ్చన్నపేట మండల కేంద్రంలో గత కొన్నేళ్లుగా మోటార్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. వృత్తిలో భాగంగా మోటార్ పంపు కొనుగోలు చేసేందుకు జనగామ పట్టణానికి వచ్చాడు. అవసరమైన పరికరాలు కొనుగోలు చేసి తన స్కూటీపై స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో పట్టణంలోని సిద్దిపేట రోడ్ ఫ్లైఓవర్ పైకి రాగానే ఒక్కసారిగా తీవ్ర గుండెపోటు రావడంతో స్కూటీపైనే కుప్పకూలిపోయాడు. రోడ్డుపై పడి ఉన్న అతడిని గమనించిన తోటి వాహనదారులు వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడేందుకు CPR చేశారు, కానీ ఫలితం లేకపోయింది.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని లింగయ్యను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం ఇటికాలపల్లికి తరలించారు. కష్టపడి జీవించే మంచి వ్యక్తి హఠాన్మరణం చెందాడని తెలుసుకున్న స్నేహితులు, స్థానిక రైతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. ఇంటికి అండగా నిలిచిన వ్యక్తి హఠాత్తుగా మృతి చెందడంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Post a Comment