Suicide Case | వరకట్న వేధింపులకు భార్య బలి - భర్తకు 5 ఏళ్ల కఠిన జైలు శిక్ష

వరకట్న వేధింపులకు భార్య బలి - భర్తకు 5 ఏళ్ల కఠిన జైలు శిక్ష

ఇందల్వాయి మండలంలో ఘటన - ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్తకు శిక్ష ఖరారు

నిజామాబాద్, అక్టోబర్ 6: భార్యను వరకట్నం కోసం వేధించి ఆత్మహత్యకు కారణమైన భర్తకు 5 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవీఎన్ భారత లక్ష్మీ తీర్పు చెప్పినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

కేసు వివరాలు: ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన వేముల సాయిలుకు, డిచ్ పల్లి గ్రామానికి చెందిన మనోజకు 2016లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఎలాంటి వరకట్నం తీసుకోలేదు. అయితే కొన్నాళ్ల తర్వాత నగదు కావాలని భార్యను మానసిక, శారీరకంగా వేధించేవాడు. "నువ్వు చనిపోతే మరో పెళ్లి చేసుకుని కట్నం తీసుకుంటా" అంటూ హింసించేవాడు.

భర్త వేధింపులు భరించలేక మనోజ 2024 అక్టోబర్ 13న చంద్రాయన్ పల్లి శివారులోని పెద్ద పోషవ్వ గుడి దగ్గర వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

డిచ్ పల్లి సర్కిల్ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్, సాక్షుల వాంగ్మూలం, ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించారు.

శిక్ష వివరాలు:

- BNS సెక్షన్ 85 (వరకట్న వేధింపులు) కింద 3 ఏళ్ల జైలు + రూ.1000 జరిమానా

- BNS సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపణ) కింద 5 ఏళ్ల కఠిన జైలు + రూ.1000 జరిమానా

పోలీసులకు అభినందన: కేసులో శిక్ష పడేలా కృషి చేసిన బ్రీఫింగ్ ఆఫీసర్ బి. సుమలత, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బి. మనోజ్ (ఎస్సై ఇందల్వాయి), పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. రాజేశ్వర్ రెడ్డి, కోర్టు లైజన్ ఆఫీసర్ టి. గోవింద్ తదితరులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించారు.

Post a Comment

Previous Post Next Post