VC with Agrl Minister | వరి వేస్తే నష్టమే...రైతులకు కలెక్టర్ హెచ్చరిక

ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో పొడి వాతావరణం - ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యం

వరి వేస్తే నష్టమే...రైతులకు కలెక్టర్ హెచ్చరిక 

కామారెడ్డి జిల్లాలో డేంజర్ జోన్ లో భూగర్భ జలాలు 

8 నెలలు నీటి కటకటే - ఆచితూచి పంటలు వేయండి

వ్యవసాయ మంత్రి తుమ్మలతో వీడియో కాన్ఫరెన్స్ 

ధర్మారావుపేటలో రైతులతో ముఖాముఖిలో కలెక్టర్ 

సదాశివనగర్, అక్టోబర్ 22: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షపాతం గణనీయంగా తగ్గిందని, రాబోయే 8-9 నెలలు నీటి నిర్వహణే అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హెచ్చరించారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించుకుంటూ ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు.

సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామ రైతు వేదికలో గురువారం నిర్వహించిన రైతు నేస్తం, ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులతో కలిసి పాల్గొని, పత్తి మార్కెటింగ్, కనీస మద్దతు ధరలపై చర్చించారు.

భూగర్భ జలాలు 5 మీటర్లు పడిపోయాయి:

జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టం 4 నుంచి 5 మీటర్ల మేర పడిపోయిందని కలెక్టర్ తెలిపారు. సదాశివనగర్, పెద్దకొడప్గల్, మహమ్మద్ నగర్ మండలాల్లో పొడి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నిజాంసాగర్ ఆయకట్టు, చెరువుల్లో నీటి లభ్యతను అంచనా వేసుకునే పంటలు వేయాలన్నారు.

వరిపై ఆధారపడొద్దు:

యాసంగిలో వరి విస్తీర్ణం తగ్గించి జొన్న, మొక్కజొన్న, శనగ, కంది, వేరుశనగ వంటి ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. నీటి లభ్యత చూడకుండా అధిక నీరు అవసరమయ్యే పంటలు వేస్తే ఆర్థికంగా నష్టపోతారని హెచ్చరించారు. ఆయిల్ పామ్, కూరగాయలు వంటి ఉద్యాన పంటలతో అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.

ప్రతి ఇంటా ఇంకుడు గుంత తప్పనిసరి:

ప్రతి ఇంటి వద్ద, ప్రతి పొలంలో వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ఇంకుడు గుంతలు, నిల్వ గుంతలు తవ్వాలని పిలుపునిచ్చారు. రసాయన ఎరువులు తగ్గించి, భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడుతూ, ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చు తగ్గించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యాన అధికారి జ్యోతి, మార్కెటింగ్ అధికారి రమ్య తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

Previous Post Next Post