Collector | వెట్టిచాకిరీ నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించాలి

వెట్టిచాకిరీ నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించాలి

‘స్వేచ్ఛా రథం’ ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు

కామారెడ్డి, అక్టోబర్ 22: వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

వెట్టిచాకిరీ నిర్మూలన, కార్మికుల హక్కుల పరిరక్షణ, బాధితులకు ప్రభుత్వ సహాయంపై అవగాహన కోసం రూపొందించిన ‘స్వేచ్ఛా రథం’ ప్రచార వాహనాన్ని గురువారం కలెక్టరేట్ లో ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చట్టం అమల్లో ఉన్నప్పటికీ కొన్ని చోట్ల వెట్టిచాకిరీ ఘటనలు వెలుగు చూస్తున్నాయన్నారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులను గుర్తించి, రక్షించి, పునరావాసం కల్పించాలని సూచించారు. వెట్టిచాకిరీ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ రథం జిల్లాలోని వ్యవసాయం, ఇటుక బట్టీలు, చేపలు-రొయ్యల పెంపకం, గనులు, క్వారీలు వంటి రంగాల్లో పనిచేసే అసంఘటిత కార్మికులకు హక్కులు, ఫిర్యాదు విధానాలపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు.

టోల్ ఫ్రీ నంబర్ 080-69434343 కు ఫిర్యాదు చేయండి:

వెట్టిచాకిరీ బాధితులు లేదా అలాంటి ఘటనలు తెలిసిన వారు 080-69434343 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. అప్పులు, ముందస్తు చెల్లింపులు, బలవంతపు ఒత్తిళ్లతో చిక్కుకున్న వారికి ప్రభుత్వ సహాయంపై గ్రామీణ ప్రాంతాల్లో కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తామన్నారు.

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డాక్టర్ మున్నం శశికుమార్ అధికారులతో వెట్టిచాకిరీ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దామోదర్, జిల్లా పంచాయతీ అధికారి మురళి, అంతర్జాతీయ న్యాయ సహాయ సంస్థ (IJM) ప్రతినిధి ఆనంద్ కుమార్, కార్మిక, పోలీస్, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, జిల్లా న్యాయ సేవల సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

కామారెడ్డిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు

కామారెడ్డి, అక్టోబర్ 22: తెలంగాణలో ధైర్యసాహసాలకు, ప్రజా పోరాటాలకు ప్రతీకగా నిలిచిన పండుగ సాయన్న జయంతి వేడుకలను గురువారం కామారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఎప్ప ఉమారాణి శ్రీనివాస్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య, సహాయ బీసీ అభివృద్ధి అధికారి మామిండ్ల చక్రధర్ పాల్గొన్నారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న జీవితం, ధైర్యసాహసాలు, ప్రజల కోసం చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. ఆయన చరిత్రను భావితరాలకు తెలియజేసి, సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం పెంపొందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు - జిల్లా అధ్యక్షులు గజ్జల భిక్షపతి ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు కల్ల గంగారాజం ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు బట్టు విట్టల్ ముదిరాజ్, కౌన్సిలర్లు కల్ల గణేష్ ముదిరాజ్, భాను ప్రసాద్ ముదిరాజ్, గ్రంథాలయ మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్ ముదిరాజ్, మాజీ జడ్పీటీసీ నంద రమేష్ ముదిరాజ్, బీసీ విద్యార్థి జిల్లా అధ్యక్షులు నీలా నాగరాజు ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు, బహుజన సంఘ నాయకులు కొత్తపల్లి మల్లయ్య, ఒడ్డెర ఎల్లయ్య, TNGOs జిల్లా కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post