ABVP Protest | హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ABVP ఆందోళన:

 

అంబేద్కర్ ఫోటోతో ఏబీవీపీ కార్యకర్తలు

హాస్టళ్ళలో భద్రతా వసతులు లేక ఇబ్బందులు

కామారెడ్డి అదనపు కలెక్టర్‌కు వినతి

తెలంగాణ డైలీ న్యూస్,  కామారెడ్డి: జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు భద్రతా వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆరోపించింది. 

 మంగళవారం ABVP ఆధ్వర్యంలో కార్యకర్తలు  డా. బీఆర్ అంబేద్కర్ ఫోటో సాక్షిగా అదనపు కలెక్టర్ విక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ABVP రాష్ట్ర నాయకులు చరణ్ మాట్లాడుతూ, “జిల్లాలో వరుసగా ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు మృతి చెందిన ఘటనలు, హాస్టళ్లపై దాడులు జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు. బాలికల హాస్టళ్లలో కనీసం సీసీ కెమెరాలు, కిటికీలు, ప్రహరీ గోడ వంటి ప్రాథమిక వసతులు కూడా లేవు. విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీని వల్లే విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. హాస్టళ్లలో జరుగుతున్న ఘటనలపై వెంటనే విచారణ జరిపి, కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

“వీలైనంత త్వరగా హాస్టళ్ల అభివృద్ధిపై కార్యాచరణ రూపొందించాలి. లేని పక్షంలో జిల్లాలోని హాస్టల్ విద్యార్థులందరం కలిసి కలెక్టర్ కార్యాలయంలో బస చేస్తాం” అని చరణ్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ABVP కార్యకర్తలు కౌశిక్, అక్షయ్, అజార్, శివ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. వినతి పత్రం స్వీకరించిన అదనపు కలెక్టర్ సమస్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ABVP నాయకులు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post