Kavita New Party | కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన'

 


కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ 

మూడున్నర కోట్ల ప్రజలకు అమ్మ గా ఉంటా

ప్రజలకు అన్ని రంగాల్లో సేవ చేస్తా

త్వరలో జిల్లా, మండల, గ్రామ కమిటీలు

టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కల్వకుంట్ల కవిత

తెలంగాణ డైలీ న్యూస్, మేడ్చల్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేన’, సంక్షిప్తంగా *టీఆర్ఎస్* అని వెల్లడించారు. మూడున్నర కోట్ల ప్రజలకు అమ్మ గా ఉంటానని ప్రకటించారు.


ఆవిర్భావ సభ ముఖ్యాంశాలు:

శనివారం ఉదయం మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని ఆధ్వరా కన్వెన్షన్ హాల్‌లో భారీ ఎత్తున నిర్వహించిన ఆవిర్భావ సభలో కవిత ఈ ప్రకటన చేశారు.

1.  కార్యక్రమ పరంపర: సభకు ముందు కవిత తన నివాసంలో సర్వ మత ప్రార్థనలు చేశారు. అనంతరం గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, భారీ కాన్వాయ్‌తో సభా వేదికకు చేరుకున్నారు.

2.  జనసందోహం: రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జాగృతి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పార్టీ పేరును ప్రకటించారు. ప్రకటన వెంటనే సభా ప్రాంగణం ‘జై తెలంగాణ’, ‘సీఎం సీఎం’ నినాదాలతో మారుమోగింది.

పార్టీ అజెండా – కవిత ప్రకటన:

సభలో కవిత మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పార్టీ అజెండాను వివరించారు:

- *ప్రధాన లక్ష్యం:* తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పని చేయడం.

- *కీలక అంశాలు:* మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, రైతుల సంక్షేమం, ఉపాధి కల్పన.

- *విధానం:* విద్య, వైద్యం, సాగునీరు, ఉద్యోగాలపై ప్రత్యేక విధానాలు రూపొందిస్తాం.

- *నిర్మాణం:* త్వరలో జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తాం.

“ఉద్యమం నుంచి వచ్చిన అనుభవంతో ప్రజలకు దగ్గరగా ఉండే రాజకీయాలు అందిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు సరైన ప్రత్యామ్నాయం అవసరం. ఆ బాధ్యతను మా పార్టీ తీసుకుంటుంది” అని కవిత స్పష్టం చేశారు.

*విశ్లేషకుల అంచనా:* కవిత కొత్త పార్టీ ఆవిర్భావంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు, కొత్త చర్చలకు తెరలేచింది. రాబోయే ఎన్నికలపై ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



కవిత స్పీచ్ ఆమె మాటల్లోనే....

బీజేపీ కి తెలంగాణ రావటమే ఇష్టం లేదు

తల్లిని చంపి బిడ్డను తీశారని బీజేపీ పెద్దలు అంటారు

మెడకాయ మీద తలకాయ లేని ఒక ఎంపీ తెలంగాణను భారత్ పాక్ విభజనతో పోల్చుతారు

అగ్రనాయకత్వం అలా మాట్లాడితే బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట్లాడరు

మనకు ఒక్క రూపాయి ఇవ్వకపోయిన సరే మన బీజేపీ ఎంపీలు మాట్లాడరు

సామాజిక న్యాయం అనే దానికే బద్ద వ్యతిరేకి బీజేపీ

మహిళ బిల్లు పక్కన పెట్టారు. బీసీ బిల్లు, కులగణన బిల్లు తొక్కి పెట్టారు

పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీని పక్కన పెట్టారు

ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టి మన ఏడు మండలాలు తీసుకున్నారు

అయిన సరే ఈ బీజేపీ బానిస ఎంపీలు పెదవులు తెరవరు

ఈ బీజేపీ బానిస ఎంపీలకు నేను సవాల్ చేస్తున్నా 

మీరు తెలంగాణ బిడ్డలైతే భద్రాచలం వద్ద ఐదు గ్రామాలను తెలంగాణకు పట్టుకురండి

పోలవరం పూర్తయితే ఆ గ్రామాలు మునిగిపోతాయి

ఇంకా ఏం మాట్లాడారంటే......


పార్టీ ప్రకటన అనంతరం ఆమె మాట్లాడుతూ  ‘‘తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించా. నాకు సింగరేణి అంటే చాలా ఇష్టం. తెలంగాణ ఆడబిడ్డలను ఏకం చేసిన ఘనత జాగృతిదే. బతుకమ్మతో తెలంగాణ సంస్కృతిని చాటాం. బతుకమ్మను ప్రపంచానికి పునఃపరిచయం చేసుకున్నాం. తెలంగాణ ఉద్యమానికి బలమైన సాంస్కృతి పునాది వేసింది జాగృతి. అయితే వచ్చిన తెలంగాణ ఎక్కడో దారి తప్పింది. 12 ఏళ్లు గడిచినా తెలంగాణ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. సామాజిక తెలంగాణ రథచక్రం ఎక్కడో విరిగి ముక్కలైంది. తెలంగాణ ఆనాడు పాలించిన కుటుంబంలో నేను భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నా. ఆనాడు ఇసుక మాఫియా ఎన్నో దారుణాలకు పాల్పడింది.  అలాగే తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు మాత్రం గర్వపడుతున్నా అన్నారు.

*తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలి. కేసీఆర్‌ పాలనలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ తప్పు సరిదిద్దుకునేందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన(TRS)తో మీ ముందుకు వచ్చాను. బీఆర్‌ఎస్‌ తెలంగాణ ఆత్మను కోల్పోయింది.  మంచి చేయాలంటే రాజకీయ పార్టీ ఉండాలి. తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మందికి అమ్మగా మారాలనుకుంటున్నా. బిడ్డల కష్టం అమ్మకే తెలుస్తుంది. అప్పుడే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరతాయి’’ అంటూ ప్రసంగించారామె.*

*పాంచజన్య హామీలు ఇవే :  తెలంగాణలో ఉన్న మూడు పార్టీలు అధర్మం, అవినీతి, బంధు ప్రీతితో నిండిపోయాయి. ఎంతో మంది ఎన్నో మాట్లాడారు.. కానీ మనకు ఏమీ చేయలేదు. ఆ మూడు పార్టీలపై మన టీఆర్‌ఎస్‌(తెలంగాణ రాష్ట్ర సేన) తరఫున పాంచజన్యం పూరిద్దాం. ప్రస్తుతం మనమే ప్రధాన ప్రతిపక్షం. మరో రెండేళ్లలో అధికార పక్షం. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం.. ఈ ఐదు అంశాలపైనే నా పోరాటం అంటూ పాంచజన్యం పేరిట ఐదు హామీలు ప్రకటించారామె.*

*సరికొత్త అధ్యాయానికి  శ్రీకారం*

*తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి కల్వకుంట్ల కవిత  శ్రీకారం చుట్టారు. ఇవాళ మేడ్చల్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS)గా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ముఖ్యంగా తన తండ్రి కేసీఆర్, గత బీఆర్ఎస్ పాలనపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.*

*కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమ రథం దారితప్పిందని కవిత ఆరోపించారు. సామాజిక తెలంగాణ రథచక్రం ఎక్కడో విరిగి ముక్కలైందని, ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లయినా ప్రజల కలలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ గారు ఇప్పుడు మన మనిషి కాదు.. ఆయనో మర మనిషి.. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆయన రారు. తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయింది’ అని కవిత ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వ్యక్తిగత స్వేచ్ఛ కరువైందని, ఎవరి ఫోన్ ఎవరు వింటున్నారో అనే భయంతో ప్రజలు బతుకుతున్నారని, దారుణమైన నిఘా నీడలో తెలంగాణ మగ్గిపోయిందని ఆమె మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఒక అమ్మగా పరిణతి చెందాలనుకుంటున్నానని, అమ్మతనంతో పనిచేస్తే బిడ్డలకు ఏ కష్టమొచ్చినా అడ్డుకోవచ్చని ఆమె భావోద్వేగానికి కవిత లోనయ్యారు.*

*తొలి ముఖ్యమంత్రి ఏం చేశారు..?*

*తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు గర్వపడుతున్నా.. కానీ ఆనాడు పాలించిన కుటుంబంలో భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోల్చిన బీజేపీ ఎంపీపై ఆమె మండిపడ్డారు. మెడ మీద తలలేని ఎంపీలు అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే, రాష్ట్రంలోని బీజేపీ బానిస ఎంపీలు నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. తొలి ముఖ్యమంత్రి పాలనలో పదేళ్లలో రూ. 1.89 లక్షల కోట్లు ఖర్చు చేసినా, కేవలం 18 లక్షల ఎకరాలకే నీళ్లిచ్చారని ఆమె విమర్శించారు. సింగరేణి అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతూనే, కార్మికుల పక్షాన పోరాడతానని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు.*

*చివరకు నన్నే సస్పెండ్ చేశారు*

*పాత కేసీఆర్ అయ్యింటే ఈపాటికి పాలమూరు ప్రాజెక్టును కట్టించేవారని కవిత అన్నారు. కానీ, మారిన కేసీఆర్ పంజాబ్ వెళ్లారు, జాతీయ పార్టీ పెడతామన్నారని కామెంట్ చేశారు. ఒకప్పుడు సింగరేణి గనిలో కార్మికుడు చనిపోతే పరిగెత్తుకెళ్లి పరామర్శించే వ్యక్తి.. నేడు ప్రజల కష్టాలను పట్టించుకోవడం మానేశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడారంటే ఏదో అనుకోవచ్చు, ఆయనకు రాజకీయం అస్సలు తెలియదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక కర్కోటకుడి పాలన నడుస్తోందని, ప్రజల ఇళ్లను కూల్చుతుంటే ఆదుకోవాల్సిన ‘అమ్మ’ లాంటి కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్‌లో మార్పు వస్తుందేమోనని తాను చాలా కాలం వేచి చూశానని అన్నారు. కానీ మార్పు రాకపోగా, నన్నే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, తనపై జరిగిన క్రమశిక్షణా చర్యను కవిత గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఆత్మను కాపాడేందుకే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందని, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతానని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు
.

Post a Comment

Previous Post Next Post