Police Raid | జూదంపై పోలీసుల ఉక్కుపాదం

కామారెడ్డి, మాచారెడ్డి ల్లో జూదరులను అరెస్ట్ చేసిన దృశ్యాలు

👉కామారెడ్డి జిల్లాలో 9 మంది అరెస్ట్

👉నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం

👉జూదం ఆడితే చట్టపరమైన చర్యలు : ఎస్పీ

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: జిల్లాలో అక్రమ పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి 9 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు.

మంగళవారం విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు.

మాచారెడ్డి ఘటన: మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని చుక్కాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,750 నగదు, 4 మొబైల్ ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కామారెడ్డి పట్టణ ఘటన: కామారెడ్డి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో నిర్వహించిన తనిఖీల్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 7,590 నగదు, 5 మొబైల్ ఫోన్లు, ఒక ఆటోను సీజ్ చేశారు.

ఈ రెండు ఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, “జూదం అనేది కేవలం ఒక ఆట కాదు, అది ఒక వ్యసనం. క్షణికమైన లాభం కోసం ఆశపడి కష్టార్జితాన్ని కోల్పోవడమే కాకుండా, మీపై ఆధారపడిన కుటుంబాలను కష్టాల్లోకి నెట్టవద్దు. పేకాట ఆడుతూ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

గౌరవప్రదమైన సమాజంలో జూదానికి చోటు లేదని, అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కితే జైలు శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

జిల్లాలో ఎక్కడైనా అక్రమ పేకాట, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

Post a Comment

Previous Post Next Post