👉ప్రాణాలకు తెగించి పనిచేసిన సిబ్బంది నిజమైన ‘ఖాకీ హీరోలు’
👉ప్రజల భద్రత కోసం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి
👉పోలీసులను ప్రశంసించిన ఎస్పీ
తెలంగాణ డైలీ న్యూస్-కామారెడ్డి
మృత్యువు అంచున ఉన్నవారిని కాపాడి, విధి నిర్వహణలో సాహసం, సమయస్ఫూర్తి, మానవతా దృక్పథం చూపిన పోలీస్ సిబ్బందిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ యం. రాజేష్ చంద్ర అభినందించారు. నేర నియంత్రణతో పాటు ప్రాణరక్షణలోనూ కామారెడ్డి పోలీసులు ముందున్నారని కొనియాడారు.
ప్రశంసలు అందుకున్న 5 ఘటనలు ఇవే:
1. బాన్సువాడ – ఉరి నుంచి కాపాడారు:
ఆస్తి తగాదాలతో ఉరివేసుకున్న రంగరి వెంకటిని ‘డయల్ 100’ కాల్ రాగానే బ్లూ కోల్ట్స్ సిబ్బంది పిసి డి. నవీన్, హోంగార్డ్ రాములు తలుపులు పగలగొట్టి కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని కాపాడారు.
2. రాజంపేట – వాటర్ ట్యాంక్‌పై ఆత్మహత్యాయత్నం భగ్నం:
బసవన్నపల్లి గ్రామంలో వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తిని పెట్రోలింగ్ సిబ్బంది కానిస్టేబుల్ జె. శ్రీనివాస్, హోంగార్డ్ రాజిరెడ్డి సాహసోపేతంగా ట్యాంక్ ఎక్కి క్షేమంగా కిందకు దించారు.
3. సదాశివనగర్ – అర్ధరాత్రి చెరువు వద్ద కాపాడారు:
టెక్రియాల్ చెరువు వద్ద ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని బ్లూ కోల్ట్స్ సిబ్బంది పి.సి. వినయ్ రెడ్డి, హోంగార్డ్ మురళి, ఏఆర్‌హెచ్‌సీ శ్రీనివాస్ సమయస్ఫూర్తితో స్పందించి, సున్నితంగా మాట్లాడి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు.
4. రామారెడ్డి – 8 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత:
పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై సమాచారంతో కానిస్టేబుల్ చందర్, హోంగార్డ్ కైలాష్ మెరుపు దాడి చేసి 8 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
5. కామారెడ్డి పట్టణం – దొంగను పట్టుకున్నారు:
బీట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ బాబయ్య, హోంగార్డ్ లింబాద్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న గత నేర చరిత్ర ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని నేరాన్ని అడ్డుకున్నారు. వీరికి ఎస్పీ నగదు బహుమతి అందజేశారు.
జిల్లా ఎస్పీ సందేశం:
“మానవ ప్రాణం అత్యంత విలువైనది. క్షణికావేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తాయి. సమస్య ఏదైనా సరే, ఆత్మహత్య దానికి పరిష్కారం కాదు. ఒత్తిడిలో ఉన్నవారు పోలీసుల సహాయం తీసుకోవాలి. *‘డయల్ 100’* సేవలను వినియోగించుకోవడం ద్వారా పోలీసుల సేవలను అతి త్వరగా పొందవచ్చు.”
విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి పనిచేసిన సిబ్బంది నిజమైన ‘ఖాకీ హీరోలు’ అని ఎస్పీ కొనియాడారు. నేర నియంత్రణతో పాటు ప్రాణరక్షణలో చూపిన మానవతా దృక్పథమే పోలీసు శాఖకు గౌరవాన్ని పెంచుతుందన్నారు. ప్రజల భద్రత కోసం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.





Post a Comment