SSS Mandal Topper | మొదటి పరీక్ష రోజే తండ్రి మృతి - మండల టాపర్‌గా కొడుకు


•తండ్రి మరణాన్ని జయించిన కొడుకు కలం

•కన్నీటి చుక్కలతో రాసిన విజయగాథ

•మొదటి పరీక్ష రోజే తండ్రి మృతి - మండల టాపర్‌గా కొడుకు

•బాధను భరిస్తూ బంగారు భవిష్యత్తు లిఖించిన శ్రీదీప్

•దుఃఖాన్ని దాటి విజయం సాధించిన పదిహేనేళ్ల విద్యార్థి

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

పరీక్ష హాలులో కూర్చున్న ఆ పదిహేనేళ్ల కుర్రాడికి తెలియదు, ఇంటి దగ్గర తన తండ్రి శాశ్వతంగా కళ్లు మూశాడని.... నాగిరెడ్డిపేట మండలం చిన్నూరు గ్రామానికి చెందిన శ్రీదీప్‌కు అది పదో తరగతి మొదటి పరీక్ష.... తెలుగు పేపర్ రాస్తూ భవిష్యత్తు కలలు అక్షరాలుగా కాగితంపై పేరుస్తున్న సమయంలో, మంజీరా నది అతని తండ్రి యేసయ్యను బలితీసుకుంది...!

                                Sreedeep

పరీక్ష రాసి ఇంటికి వచ్చే వరకు తండ్రి మృతి విషయం శ్రీదీప్‌కు చెప్పలేదు. విషయం తెలిసిన క్షణం ఆ పిల్లాడి ప్రపంచం కూలిపోయింది. గోపాల్‌పేట్ ఆదర్శ పాఠశాల టీచర్లు, క్లాస్‌మేట్లు కాలి నడకన గ్రామానికి చేరుకొని శ్రీదీప్‌ను హత్తుకున్నారు. "రేపటి పరీక్ష ఎలా రాస్తాడు? అసలు రాస్తాడా?" అని అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

కానీ శ్రీదీప్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. తండ్రి ఫోటో ముందు ఒక్క క్షణం నిలబడి, మరుసటి రోజు పరీక్ష హాలుకు నడిచాడు. కళ్లలో నీళ్లు కారుతున్నా, గుండె బరువెక్కినా, ఆ చేతిలోని పెన్ను మాత్రం ఆగలేదు. దుఃఖాన్ని ఇంకుగా మార్చి, ప్రతి పేపర్‌లోనూ తన బాధను జవాబులుగా రాశాడు.

ఫలితం వచ్చే రోజు ఊరంతా ఉత్కంఠ. 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించి నాగిరెడ్డిపేట మండలంలోనే మొదటి స్థానం పొందాడు. ఆ వార్త విని టీచర్లు సంబరపడ్డారు, గ్రామస్తులు గర్వపడ్డారు. కానీ శ్రీదీప్ మాత్రం మార్కుల జాబితా చేతిలో పట్టుకొని తండ్రి ఫోటో ముందు నిలబడి వెక్కి వెక్కి ఏడ్చాడు. "నాన్నా, నువ్వు చెప్పినట్టే టాపర్‌గా నిలిచాను" అంటూ రోదించిన తీరు చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లాయి.

ఇప్పుడు చిన్నూరు గ్రామంలో పిల్లలకు శ్రీదీప్ ఒక స్ఫూర్తి. "కష్టం వచ్చినప్పుడు కూలిపోకుండా, ఆ కష్టాన్నే మెట్టుగా మార్చుకోవాలి" అని పెద్దలు పిల్లలకు చెబుతున్నారు. తండ్రి లేని లోటు తీరనిదే. కానీ ఆ తండ్రి కలను నిజం చేసిన కొడుకు కథ మాత్రం తరతరాలకు నిలిచిపోతుంది.

పట్టుదలకు నిజమైన అర్థం చెప్పాలంటే శ్రీదీప్ పేరు చెప్పాలి అంటున్నారు గ్రామస్తులు.




Post a Comment

Previous Post Next Post