•సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా మే డే
•కార్మిక హక్కుల కోసం ఉద్యమించాలి: దుబాస్ రాములు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డేను పురస్కరించుకొని బాన్సువాడలో సీపీఐ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. బాన్సువాడ సీపీఐ పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్‌చార్జి, తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాస్ రాములు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పని దినం కోసం, శ్రమకు తగ్గ వేతనం కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం చేసిన చారిత్రక పోరాటానికి గుర్తుగా మే డేను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, సమాన వేతనం కోసం జరిగిన ఆ పోరాటం ప్రపంచ కార్మిక ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక కోడ్లు కార్మికుల హక్కులను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కోడ్ల వల్ల పని గంటలు పెరిగే ప్రమాదం ఉందని, కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరిగి శాశ్వత ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ట్రేడ్ యూనియన్ల హక్కులు పరిమితం అవుతున్నాయని, కార్మికులకు లభించే భద్రత, సంక్షేమ ప్రయోజనాలు తగ్గే పరిస్థితి ఏర్పడుతోందని విమర్శించారు. ఇవి కార్మిక వర్గాన్ని బలహీనపరిచే చర్యలని అన్నారు.
కార్మికులు ఐక్యంగా ఉండాలని, తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని దుబాస్ రాములు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు తోటపల్లి శ్రీనివాస్, అబ్రహం, గంపల సాయిలు, శివాజీ, అడబల్లి రాజు, కమ్మరి రాములు, జె భూమయ్య, ధర్మం చిన్న సాయిలు, బోయిని హనుమాన్లు, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment