కుటుంబ కలహాలే కారణమా.. ఆర్థిక ఇబ్బందులా?
తండ్రి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య - నిజాంసాగర్‌లో విషాదం
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: క్షణికావేశం నిండు ప్రాణాలను బలితీసుకుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కొన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో తండ్రి తన ఇద్దరు పిల్లలను నీటిలోకి తోసేసి, తాను కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికులను కలచివేసింది.
అసలేం జరిగింది
సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ గ్రామానికి చెందిన బోయి కృష్ణ తన ఇద్దరు పిల్లలు బోయి రక్షిత్, బోయి అనున్యలను నిజాంసాగర్ ప్రాజెక్టు చూపిస్తానని తీసుకువచ్చాడు. శుక్రవారం ఉదయం ఎవరూ లేని సమయంలో ప్రాజెక్టు 20వ గేటు వద్ద ఇద్దరు పిల్లలను నీటిలోకి తోసేసి, అనంతరం తాను కూడా దూకేశాడు.
గాలింపు చర్యలు
విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి రూరల్ ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. తండ్రి బోయి కృష్ణ మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.
కారణం ఏమిటి?
కుటుంబ కలహాలా లేక ఆర్థిక ఇబ్బందులా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆర్థిక సమస్యలు, కుటుంబ ఒత్తిళ్లతో ఇలాంటి ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.





Post a Comment