మూడు కేసులను ఛేదించిన మద్నూర్ పోలీసులు
ముగ్గురు నిందితుల నుంచి బైకులు, కత్తులు, ఫోన్లు స్వాధీనం
హైవేపై ప్రయాణికులను లక్ష్యంగా చేసుకున్న ముఠా
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 10: కామారెడ్డి జిల్లా పరిధిలోని హైవేలపై ఒంటరిగా ప్రయాణిస్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర నేర ముఠాను మద్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి మూడు కీలక కేసులను ఛేదించారు. వివరాలను బాన్సువాడ డీఎస్పీ బి. విఠల్ రెడ్డి వెల్లడించారు.
షేక్ గౌస్‌పై దోపిడీతో కేసు నమోదు
తేదీ 02.06.2026న మద్నూర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి-161పై బైక్‌పై ప్రయాణిస్తున్న షేక్ గౌస్ నివాసం దెగ్లూర్, మహారాష్ట్రను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి కత్తి చూపించి చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ మరియు రూ.1000 నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రత్యేక బృందాలతో గాలింపు
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, బాన్సువాడ డీఎస్పీ బి. విఠల్ రెడ్డి పర్యవేక్షణలో బిచ్కుంద సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, మద్నూర్ ఎస్‌ఐ మోహన్ రెడ్డి, CCS ఎస్‌ఐ ఉస్మాన్‌తో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్‌ల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
నిందితులు ముగ్గురు నాందేడ్ వాసులు
దర్యాప్తులో నిందితులు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ ఇలియాస్, మహమ్మద్ ఇస్మాయిల్ అలియాస్ జునైద్, సమీర్ షా అని గుర్తించారు. వీరు హైవేలపై ఒంటరిగా ప్రయాణించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని మారణాయుధాలతో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.
ఒకే రోజు మూడు దోపిడీలు
పథకం ప్రకారం 01.06.2026న నాందేడ్ నుండి స్ప్లెండర్ బైక్‌పై బయలుదేరిన నిందితులు మద్నూర్ వద్ద షేక్ గౌస్‌ను దోచుకోవడంతో పాటు, అదే రాత్రి జుక్కల్ చౌరస్తా వద్ద వి. శ్రీనివాస్‌ను కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్ మరియు రూ.300 నగదు లాక్కొన్నారు. అదే రోజు రాత్రి నిజాంసాగర్ పరిధిలో చాకలి రాజు వద్ద నుండి పల్సర్ బైక్‌ను దోచుకున్నారు. ఈ మూడు ఘటనలపై మద్నూర్, జుక్కల్, నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.
చెక్‌పోస్ట్ వద్ద పట్టుబడ్డారు
దర్యాప్తు సమయంలో నిందితులు సలబతుపూర్ సమీపంలో మరో వ్యక్తిని అడ్డగించి కత్తితో బెదిరించి దోపిడీ చేయాలని వస్తుండగా, సలబతుపూర్ చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు వారిని గుర్తించి పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు చేసిన నేరాలను అంగీకరించారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు :
1. 3 కత్తులు దోపిడీలకు ఉపయోగించినవి
2. 4 మొబైల్ ఫోన్లు
3. 2 మోటార్‌సైకిళ్లు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హైవేలపై ప్రయాణించే సమయంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని డీఎస్పీ తెలిపారు.
పోలీసు బృందానికి అభినందనలు
ఈ కేసులను చాకచక్యంగా ఛేదించిన బిచ్కుంద సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, మద్నూర్ ఎస్‌ఐ మోహన్ రెడ్డి, CCS ఎస్‌ఐ ఉస్మాన్, కానిస్టేబుళ్లు విఠల్, విష్ణు, శ్రావణ్, శివ, శ్రీకాంత్ తదితరులు మరియు వారి బృందాన్ని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అభినందించినట్లు డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు.

Post a Comment