Top News

Siddipet meals for Amarnath pilgrims | అమర్‌నాథ్ యాత్రికులకు సిద్ధిపేట భోజనాలు

•అమర్‌నాథ్ యాత్రికులకు సిద్ధిపేట భోజనాలు  

•సోమవారం సరుకుల లారీకి పూజలు...

•57 రోజులపాటు అన్నదానం... 

•ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యే హరీశ్ రావు, దుబ్బాక, నిజామాబాద్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణలు హాజరు

•దక్షిణాది యాత్రికులకు తెలుగు రుచులు

తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో(దాస శ్రీనివాస్), సిద్ధిపేట, జూన్ 13: 

అత్యంత మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్న అమర్‌నాథ్ ఆలయానికి వచ్చే యాత్రికుల కడుపులు నింపేందుకు సిద్ధిపేట అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు సిద్ధమవుతున్నారు. ప్రతి ఏటా మాదిరిగా ఈ సారి కూడా అమర్‌నాథ్ యాత్రకు వచ్చే వేలాది మంది భక్తులకు దక్షిణాది రాష్ట్రాల రుచులను అందించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.

15 ఏళ్లుగా కొనసాగుతున్న సేవ  

అమర్‌నాథ్ యాత్రకు వచ్చే భక్తులకు ఉత్తరాది రుచులు తప్ప దక్షిణాది భోజనాలు దొరికేవి కాదు. దీంతో దక్షిణాది రాష్ట్రాల భక్తులు సరైన తిండి దొరకక తీవ్ర ఇబ్బందులు పడేవారు. దక్షిణాది వంటలు లేక యాత్రికులు పడుతున్న ఇబ్బందులను గమనించిన సిద్ధిపేట వాసులు వారి ఆకలిని తీర్చాలన్న ఆలోచనతో 2011లో అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితిని ప్రారంభించారు. 15 ఏళ్లుగా ఈ సంస్థ సేవా కార్యక్రమాలను అప్రతిహతంగా కొనసాగిస్తోంది.


జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు యాత్ర 

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో హిమాలయాల్లో ఉన్న పరమశివుడిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. గుహలో మంచు లింగాకారంలో ఉన్న లయకారుణ్ణి దర్శించుకుని భక్తులు తరిస్తారు. సమస్త జీవకోటిని కాపాడటానికి ఆ పరమశివుడే అమరనాదేశ్వరునిగా వెలిశాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అమర్‌నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 28 వరకు కొనసాగుతుంది.

మూడు చోట్ల భోజన వసతి  

యాత్ర ముగిసే 57 రోజులపాటు సిద్ధిపేట అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు అక్కడే ఉండి యాత్రికులకు రుచికరమైన తెలుగువారి భోజనాలను అందించనున్నారు. బాల్తాల్ బేస్ క్యాంప్ లంగర్ నంబర్ 8, పంచతరణిలోని లంగర్ నంబర్ 2, అమర్‌నాథ్ గుహ దగ్గర భోజన వసతిని ఏర్పాటు చేశారు. భోజనాలే కాకుండా ప్రతి రోజు ఉదయం వివిధ రకాల టిఫిన్లను కూడా అందించనున్నారు.

ఈ నెల 15న సరుకుల లారీ తరలింపు 

అమర్‌నాథ్ యాత్రికుల కోసం ఈ నెల 15న, సోమవారం సిద్ధిపేట నుంచి సరుకుల లారీని పంపిస్తున్నట్లు అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షులు నందిని శ్రీనివాస్ వెల్లడించారు. శనివారం సిద్ధిపేటలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ ఛైర్మన్ చీకటి మధుసూదన్‌తో కలిసి మాట్లాడారు.

ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభం

సోమవారం స్థానిక శరభేశ్వర ఆలయం వద్ద ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎంపీ రఘునందన్ రావు, దుబ్బాక, నిజామాబాద్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణలు జెండా ఊపి సరుకుల వాహనాన్ని ప్రారంభిస్తారని వివరించారు. దాతల సహకారంతో 15 ఏళ్లుగా అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

దక్షిణాదిలో సిద్ధిపేటకే ఆ గౌరవం  

అమర్‌నాథ్ యాత్రికులకు తెలుగు వారి రుచులను అందించే అవకాశం దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క సిద్ధిపేటకు దక్కడం గర్వకారణమని నందిని శ్రీనివాస్ అన్నారు. ప్రతి రోజు ఎముకలు కొరికే చలిలో పరమశివుణ్ణి దర్శించుకోవడానికి వచ్చే యాత్రికులకు రుచికరమైన అల్పాహారంతో పాటు భోజన వసతిని కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. భగవంతుని దగ్గరకు వచ్చే ప్రతి భక్తుని కడుపు నింపడమే అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి లక్ష్యమన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో సంస్థ ప్రధాన కార్యదర్శి మాంకాల నవీన్, కోశాధికారి గుబ్బ లింగమూర్తి, ఉపాధ్యక్షులు గోపిశెట్టి శరభయ్య, జిల్లా శ్రీనివాస్, అనిల్ శ్రీనివాస్, అయిత రత్నాకర్, గౌరవాధ్యక్షులు కాచం కాశీనాథ్, సలహాదారులు గంప శ్రీనివాస్, మాడిశెట్టి భాస్కర్, రాజూరి వెంకటేశం, ఉప్పల కృష్ణమూర్తి, సముద్రాల రమేశ్, దుందిగల్ల నాగరాజు, పోశెట్టి శ్రీకాంత్, కూర శేషు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post