Child Care in Hospital | బాన్సువాడ ఆసుపత్రిలో మానవత్వం – వీడ్కోలులో కన్నీళ్లు


•బాన్సువాడ ఆసుపత్రిలో మానవత్వం – వీడ్కోలులో కన్నీళ్లు 

•వారం రోజులు కన్నబిడ్డలా చూసుకున్న నర్సులు  

•శిశు సంరక్షణ శాఖకు అప్పగిస్తుండగా భావోద్వేగం

తెలంగాణ డైలీ న్యూస్,బాన్సువాడ:

మదీనా కాలనీలో తల్లిదండ్రులు వదిలివెళ్లిన ఒక శిశువుపై బాన్సువాడ ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది చూపిన మమకారం అందరి హృదయాలను కదిలించింది.


(Video 👆)

అమ్మ ఒడిలా ఆసుపత్రి:  

వారం క్రితం మదీనా కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువు ను వదిలివెళ్లగా, కాలనీ వాసులు ఆ బాబు ప్రాణాలు కాపాడి, పోలీసులకు సమాచారం ఇవ్వగా, శిశువును పోలీసులు బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రి నర్సులు, వైద్య సిబ్బంది ఆ పసికందును కన్నబిడ్డలా చూసుకున్నారు. సమయానికి పాలు పట్టడం, వైద్యం అందించడం, నిద్రపుచ్చడం – ఏ లోటు లేకుండా ఎంతో ఆప్యాయతగా పెంచారు. దీంతో శిశువుపై సిబ్బందికి విపరీతమైన ప్రేమ ఏర్పడింది.

కన్నీటి వీడ్కోలు:  

అయితే మంగళవారం శిశు సంరక్షణ శాఖ అధికారులు ఆసుపత్రికి వచ్చి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయ్ కుమార్ నుంచి శిశువును అధికారికంగా తీసుకొని వెళ్లారు. వారం రోజులుగా తమ కళ్ల ముందే పెరిగిన ఆ పసివాడు దూరమవుతుండటంతో నర్సులు, సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లతో శిశువుకు వీడ్కోలు పలికారు. ఆ దృశ్యం చూసిన వారందరినీ కలచివేసింది.




మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం:  

“డ్యూటీలో భాగమే అయినా, ఆ పిల్లాడు మా అందరి మనసులకు దగ్గరయ్యాడు. వదిలి వెళ్తుంటే మా బిడ్డను పంపినట్టే అనిపించింది” అని ఓ నర్సు కన్నీటితో తెలిపారు. శిశువును ప్రస్తుతం శిశు సంరక్షణ శాఖ అధికారులు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ఆసుపత్రి సిబ్బంది చూపిన ఈ మానవత్వం, వారి ప్రేమ అందరికీ ఆదర్శంగా నిలిచింది.


Post a Comment

Previous Post Next Post