Top News

MLA Thota Serius on Police | పోలీసుల తీరుపై జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు అసంతృప్తి

పోలీసుల తీరుపై జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు అసంతృప్తి 

ఇందిరమ్మ ఇసుక ట్రాక్టర్లపై కేసులు 

మహారాష్ట్ర వారు అక్రమ ఇసుక తరలిస్తున్నా పట్టించుకోరు

హాలివుడ్ తరహా దాడులు వద్దు 

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

 కామారెడ్డి జిల్లా పోలీసులు హాలీవుడ్ తరహాలో సాగిస్తామంటే కుదరదని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. శుక్రవారం బాన్సువాడలో ఆర్డీఓ కార్యాలయ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు.

సినిమా తరహా పాలన సరికాదు  

పోలీసులు వీడియో గేమ్‌లు, నెట్‌ఫ్లిక్స్‌లో హాలీవుడ్ సినిమాలు చూసి అమెరికా పోలీసుల తరహాలో ఇక్కడ వ్యవహరించడం సరికాదని అన్నారు. వీడియో గేమ్‌ల తరహాలో పాలన నడపడం సరికాదని వ్యాఖ్యానించారు. పోలీసులు మానవత్వంతో పనిచేయాలని, లేని వారు కామారెడ్డి జిల్లాకు, జుక్కల్ నియోజకవర్గానికి అవసరం లేదని స్పష్టం చేశారు.

అనుమతులున్న ట్రాక్టర్ల సీజ్‌పై ఆవేదన  

తన నియోజకవర్గంలో నలుగురు ఇందిరమ్మ లబ్ధిదారులు ప్రభుత్వ అనుమతులతో ఇసుక తెస్తుంటే పోలీసులు ట్రాక్టర్లను సీజ్ చేశారని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారికి చెప్పినా వదల్లేదని, కోర్టులో ప్రవేశపెట్టారని వెల్లడించారు. లబ్ధిదారులకు ఇసుక దొరకకపోతే ఇళ్లు ఎలా కట్టుకుంటారని ప్రశ్నించారు.

అర్ధరాత్రి ఫిర్యాదుపై స్పందన లేదు  

మహారాష్ట్ర నుంచి అర్ధరాత్రి వేళ ఇసుకను తన నియోజకవర్గం నుంచి తరలిస్తుంటే, తాను 400 మీటర్ల దూరంలో ఉండి జీపీఎస్ వివరాలతో సహా ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. అర గంట తర్వాత ఫోన్ చేస్తే అక్కడ ఏమీ లేదని చెప్పారని, పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రజా సేవకులేనని, ప్రజలకు సేవ చేయాల్సిందేనని గుర్తు చేశారు.

11 వేల ఇళ్ల నిర్మాణం గొప్ప విషయం  

బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారం 11 వేల ఇళ్లను ఎలా నిర్మించారో అర్థం కావడం లేదన్నారు. 11 వేల ఇళ్లు కట్టడం గొప్ప విషయమే అని కొనియాడారు. అయితే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఇవ్వకుండా లబ్ధిదారులు నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో జిల్లా పోలీసులు, రెవెన్యూ అధికారులు మినహాయింపు ఇవ్వాలని కోరారు.


Note: వీడియో కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేయగలరు.

Post a Comment

Previous Post Next Post