కామారెడ్డి జిల్లాలో జూదస్థావరాలపై పోలీసుల దాడులు
ఏడుగురు అరెస్ట్, నగదు, ఫోన్లు, వాహనాలు స్వాధీనం
పిట్లంలో నలుగురు, లింగంపేటలో ముగ్గురు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారంతో లింగంపేట్, పిట్లం పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
లింగంపేట్‌లో ముగ్గురు అరెస్ట్
లింగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు, నగదు రూ.2,590 స్వాధీనం చేసుకున్నారు.
పిట్లంలో నలుగురు పట్టుబడ్డారు
పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో తిమ్మానగర్ కల్లు కాంపౌండ్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో నిర్వహించిన దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5,350 నగదు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
ఎస్పీ హెచ్చరిక
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడారు. జూదం వ్యసనానికి బానిసైతే వ్యక్తులు అప్పుల పాలై కుటుంబాల్లో ఆర్థిక, మానసిక సమస్యలు తలెత్తుతాయని, కొన్నిసార్లు ఆత్మహత్యలకు కూడా దారితీసే ప్రమాదం ఉందని తెలిపారు. జూదం కుటుంబాల్లో అశాంతిని కలిగిస్తుందని, యువత తమ భవిష్యత్తుపై దృష్టి సారించి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. జూదం ఆడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.


Post a Comment