RDO Review | తెలంగాణలో త్వరలో ఎస్ఐఆర్: అఖిలపక్ష సమావేశంలో ఆర్డీఓ దిశానిర్దేశం

తెలంగాణలో త్వరలో ఎస్ఐఆర్: అఖిలపక్ష సమావేశంలో ఆర్డీఓ దిశానిర్దేశం  

పారదర్శక ఓటర్ల జాబితా కోసం అన్ని పార్టీల సహకారం తప్పనిసరి  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:  

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎస్ఐఆర్ ప్రక్రియపై బుధవారం బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. 

ఓటర్ల జాబితాను దోషరహితంగా రూపొందించేందుకు ఎస్ఐఆర్ చేపడుతున్నట్లు ఆర్డీఓ తెలిపారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని, ఈ ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు సహకరించాలని కోరారు. 

డూప్లికేట్ ఓట్లు, మరణించినవారి పేర్లు, వలస వెళ్లినవారి పేర్లను తొలగించాలని, 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను చేర్చాలని సూచించారు. జాబితాలో తప్పులు ఉంటే నిర్ణీత గడువులోగా అభ్యంతరాలు తెలపాలని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. 

ఎలాంటి తప్పులు లేని, అత్యంత పారదర్శకమైన పక్కా ఓటర్ల జాబితాను రూపొందించడమే జిల్లా యంత్రాంగం, రాజకీయ పార్టీల ముఖ్య లక్ష్యంగా ఉండాలని  పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లా యంత్రాంగం అత్యంత పారదర్శకంగా, ఖచ్చితమైన విచారణతో బాధ్యతాయుతంగా పనిచేస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రతి రాజకీయ పార్టీ తక్షణమే తమ బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని కోరారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్య బలోపేతంలో భాగస్వాములు కావాలని, అధికారులు మరియు రాజకీయ నాయకులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జూన్ 15 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. జూన్ 15 నుంచి 24 వరకు బూత్ స్థాయి అధికారులకు శిక్షణ, ప్రిపరేషన్, ప్రింటింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర విచారణ చేపడతారని తెలిపారు. జూలై 24న పోలింగ్ కేంద్రాలను ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించడం జరుగుతుందని, జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురిస్తామని వివరించారు.

జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ముసాయిదా జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారని, సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కారం చేపడతారని తెలిపారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని వెల్లడించారు.

బీఎల్ఓల పాత్ర అత్యంత కీలకం

కొత్త ఓటర్ల నమోదు, జాబితా ప్రక్షాళనలో బూత్ స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమని ఆర్డీఓ పేర్కొన్నారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి క్షుణ్ణంగా విచారణ చేసిన అనంతరం మాత్రమే కొత్త ఓటరు నమోదు ప్రక్రియ చేపడతారని తెలిపారు.

స్థానికంగా మరణించిన వారి పేర్ల తొలగింపు, వలస వెళ్లిన వారిని గుర్తించడం, అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడం వంటి బాధ్యతలు బీఎల్ఓలపై ఉంటాయని స్పష్టం చేశారు.

కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కూడా స్పష్టతనిస్తూ, ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 2 కిలోమీటర్లకు మించి ప్రయాణించాల్సిన అవసరం లేకుండా సమీప ప్రాంతాల్లోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

01-10-2026 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి యువతి, యువకుడు తప్పనిసరిగా ఫామ్-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణల కోసం ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

దృఢమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు, కౌన్సిలర్ ఖాలిక్, మహ్మద్ గౌస్, శంకర్ గౌడ్, షాంశుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

================================

ఆర్డీఓ రవీందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సభ్యులు  

బాన్సువాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు కో ఆప్షన్ సభ్యులుగా నూతనంగా ఎన్నికైన ఖమర్ సుల్తానా గౌస్ బుధవారం బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ ఖాలెక్  ఉన్నారు. నూతనంగా ఎన్నికైన శుభసందర్భంగా ఆర్డీఓను కలిసి ధన్యవాదములు తెలిపారు.

============================

బాన్సువాడ ఎల్లయ్య చెరువులో కాలువల పూడికతీత పనులు  

నీటి నిల్వ పెంచేందుకు చర్యలు: కాంగ్రెస్ నాయకుల పరిశీలన  

బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువులో కొనసాగుతున్న ప్రధాన కాలువల పూడికతీత పనులను బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పరిశీలించారు. 

చెరువులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీత చేపట్టినట్లు నాయకులు తెలిపారు. చెరువు నుంచి తీసిన పూడిక మట్టిని రైతులు వ్యవసాయ దిగుబడి పెంచుకునేందుకు వినియోగించుకోవాలని సూచించారు. 

అలాగే గృహ నిర్మాణం చేపట్టేవారు, ఇతర అవసరాలు ఉన్నవారు, ఖాళీ స్థలం ఉన్నవారు జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో చెరువులోని పూడిక మట్టిని తరలించుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఖాలేక్, కో ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, ఖామర్ మహమ్మద్ గౌస్, మున్సిపల్ సిబ్బంది సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم