ప్రాణాలు తీస్తున్న అక్రమ మొరం, ఇసుక, రాళ్ళ గుంతలు: సోమేశ్వర్‌లో యువకుడి మృతి
అనుమతి లేని తవ్వకాలతో ప్రమాదకరంగా మారిన గుంతలు
ఈతకు దిగి బండరాళ్లు తగిలి ఆటో డ్రైవర్ మృతి
బాన్సువాడ డివిజన్‌లో అక్రమ మైనింగ్‌పై ఆగ్రహం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
బాన్సువాడ డివిజన్‌లో అక్రమ మొరం, రాళ్లు, ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గుంతలు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. గతంలో ఇసుక గుంతలు, మొరం గుంతల్లో పడి పలువురు మృతి చెందిన సంఘటనలు జరిగాయి. తాజాగా బాన్సువాడ మండలం సోమేశ్వర్ శివారులోని స్టోన్ క్రషర్/మొరం గుంతలో ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందాడు.
మృతుడిని పోతంగల్ మండలం హంగర్గ ఫారంకు చెందిన షేక్ ఆయాన్ పాషా, 22 సంవత్సరాలు, ఆటో డ్రైవర్‌గా గుర్తించారు. తండ్రి పేరు చాంద్ పాషా.
మంగళవారం తన స్నేహితులు ఎండి ముక్తార్, ఎండి రెహాన్, ఎండి సోహెల్‌తో కలిసి సోమేశ్వర్ శివారులోని కౌశల్ పక్కన గల గుంతలో ఆయాన్ పాషా సరదాగా ఈతకు దిగాడు. గుంతలో బండరాళ్లు తగలడంతో పాటు ఈత రాకపోవడంతో నీట మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ గుంత సుమారు 40 ఫీట్ల లోతు ఉంటుందని స్థానికులు తెలిపారు.
ఘటన వివరాలను బాన్సువాడ సీఐ శ్రీధర్ వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల ద్వారా మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాన్సువాడ డివిజన్‌లో అనుమతి లేకుండా అక్రమంగా మొరం, ఇసుక, రాళ్ళ తవ్వకాలు చేస్తూ ఎక్కడపడితే అక్కడ గుంతలు తీస్తున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండటం, గుంత లోతు తెలియకపోవడంతో పశువులు, చిన్నారులు, యువకులు అందులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో మంజీర నది సమీపంలో ఇసుక తోడకంతో ఏర్పడిన గుంతల్లో పడి పలువురు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. అక్రమ తవ్వకాలను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Note : వీడియో న్యూస్ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేయగలరు.




إرسال تعليق