Top News

Collector | రేపటి నుంచి కామారెడ్డి జిల్లాలో జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

రేపటి నుంచి కామారెడ్డి జిల్లాలో జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం  

ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు  

క్వింటాల్‌కు రూ.3,699 మద్దతు ధర  

రైతులు 46 కేంద్రాలను వినియోగించుకోవాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:  

రేపటి నుంచే జిల్లాలో జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. 

యాసంగి 2025-26 సీజన్‌లో జొన్నల ఎంఎస్‌పీ కొనుగోలు ప్రక్రియపై మంగళవారం మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 

జిల్లాలో యాసంగిలో 87,943 ఎకరాలలో జొన్న సాగు జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. క్వింటాల్‌కు రూ.3,699 మద్దతు ధర నిర్ణయించినందున రైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించి ప్రయోజనం పొందాలని సూచించారు. 

రైతుల సౌకర్యార్థం జిల్లాలో 46 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు చెన్ని ద్వారా శుభ్రపరచిన, FAQ ప్రమాణాలు కలిగిన జొన్నలను మాత్రమే కేంద్రాలకు తేవాలని, తేమ శాతం 13 శాతం లోపే ఉండాలని అధికారులు తెలిపారు. 

మక్కజొన్న కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జొన్నలు, మక్కజొన్న కొనుగోళ్లకు అవసరమైన గోదాములను ముందుగానే గుర్తించి అందుబాటులో ఉంచాలని సూచించారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, డి.ఎం. మార్క్‌ఫెడ్, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా సహకార అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి, డి.ఎం. సివిల్ సప్లైస్, డి.ఎం./ఆర్.ఎం. టీజీఎస్‌డబ్ల్యూసీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم