ఎల్లారెడ్డి పీఎస్‌ను తనిఖీ చేసిన మల్టీ జోన్–I ఐజీపీ
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం
బాధితులతో మానవీయంగా వ్యవహరించాలని సూచన
ఎల్లారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:
వార్షిక తనిఖీల్లో భాగంగా మల్టీ జోన్–I ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, మాల్ఖానా, ఆయుధాల భద్రత, స్టేషన్ రికార్డులు, రిసెప్షన్, సీసీటీఎన్‌ఎస్ నిర్వహణను ఐజీపీ క్షుణ్ణంగా పరిశీలించారు.
స్టేషన్ రికార్డులను తనిఖీ చేస్తూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, మిస్సింగ్ కేసులు, పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక దృష్టితో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి కేసుకు స్పష్టమైన "ప్లాన్ ఆఫ్ యాక్షన్" రూపొందించి దర్యాప్తు చేపట్టాలని సూచించారు.
మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సీసీటీఎన్‌ఎస్–2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్ వంటి డిజిటల్ సేవలపై పూర్తి అవగాహన పెంపొందించుకొని నేరాల నియంత్రణ, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదగా మాట్లాడి, వారి సమస్యలను ఓపికగా విని చట్టబద్ధమైన పరిష్కారం అందించాలన్నారు. ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు, ప్రతి కేసు వివరాలను నిర్ణీత గడువులోగా సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, అనుమానిత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని, బీట్ పోలీసింగ్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పాపిలాన్ పరికరం ద్వారా అనుమానితుల వేలిముద్రలను తనిఖీ చేసి పాత నేరస్తులను గుర్తించే చర్యలను విస్తృతం చేయాలన్నారు.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు.
విలేజ్ పోలీసింగ్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శించి స్థానిక సమాచారాన్ని సేకరించి పోలీసు రికార్డుల్లో నమోదు చేయాలని, గ్రామస్తులతో సత్సంబంధాలు పెంపొందించుకుని విశ్వసనీయ సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు.
విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ప్రతిరోజూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ రాత్రి గస్తీని మరింత పటిష్టం చేయాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం సిబ్బందితో సమావేశమై విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావం, నిజాయితీతో పనిచేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ అధికారులు, సిబ్బందిని ఐజీపీ అభినందించారు.
ఈ తనిఖీల్లో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజారెడ్డి, ఎల్లారెడ్డి పీఎస్ ఎస్‌హెచ్‌ఓ రాజు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.





إرسال تعليق