Top News

Heavy Rain | జిల్లాలో భారీ వర్షం - జలమయమైన రోడ్లు, రైతుల్లో హర్షం

జిల్లాలో భారీ వర్షం - జలమయమైన రోడ్లు, రైతుల్లో హర్షం

15 రోజుల ఉక్కపోతకు తెర - సాయంత్రం 6 నుంచి రాత్రి 10:30 వరకు ఎడతెరిపి లేని వర్షం

బాన్సువాడ/కామారెడ్డి, సెప్టెంబర్ 13 : కామారెడ్డి జిల్లాలో ముఖ్యంగా బాన్సువాడ నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత 15 రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం పెద్ద ఉపశమనం కల్పించింది.

బాన్సవాడలో   సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి 10:30 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కొనసాగింది. దీంతో ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. మోస్రా, చందూర్, వర్ణి, నస్రుల్లాబాద్, బాన్సువాడ మండలాల్లో నిరంతరాయంగా వర్షం కురిసింది. కామారెడ్డి లో రాత్రి 10 గంటల నుంచి వర్షం ప్రారంభం అయింది.

వరి పంటకు మేలు:

ముఖ్యంగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లో వర్షం కురవడంతో పంటకు ఎంతో మేలు చేకూరింది. ఇప్పటికే నిజాంసాగర్ నుంచి పంట పొలాలకు నీటిని విడుదల చేయగా, ప్రస్తుతం కురిసిన వర్షం తోడవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాత్రంతా ఇదే విధంగా వర్షం కురిస్తే వాగులు, వంకలు, చెరువులు నిండిపోయే అవకాశం ఉందని, నిజాంసాగర్ లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వాతావరణ హెచ్చరిక - కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 3 గంటల్లో మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు

గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం - TGiCCC అలర్ట్

తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీనితో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇప్పటికే బాన్సువాడ నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ అలర్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. 

ప్రజలకు సూచనలు:

- ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దు.

- రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తగా ఉండాలి.

- విద్యుత్ స్తంభాలు, బలహీనమైన నిర్మాణాలకు దూరంగా ఉండాలి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని TGiCCC సూచించింది.

ప్రస్తుతం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాతావరణం మేఘావృతమై ఉంది. Weather & Radar సంస్థ రిపోర్ట్ ప్రకారం, రాత్రి 10:30 గంటల సమయంలో కామారెడ్డిలో ఉష్ణోగ్రత 24°C గా నమోదైంది. వచ్చే 90 నిమిషాల వరకు Mostly Cloudy గా ఉంటుందని, 30% నుంచి 40% వరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిజామాబాద్ లో 25°C, సిద్దిపేటలో 25°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే గంటల్లో జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.





Post a Comment

أحدث أقدم