చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు ప్రారంభం - ఆయకట్టుకు సాగునీరు విడుదల
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
బాన్సువాడ, సెప్టెంబర్ 12: చందూర్ మండల కేంద్రంలో చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను శనివారం ఘనంగా ప్రారంభించి ఆయకట్టు పొలాలకు సాగునీటిని విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.
అంతకుముందు చందూర్ బస్టాండ్ వద్ద బాన్సువాడ - నిజామాబాద్ ప్రధాన రహదారిపై శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.
సభలో భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే పోచారం
అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు :
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నియోజకవర్గ అభివృద్ధికి ఎవరైనా అడ్డుతగులుతుంటే, అభివృద్ధి పనులు ముందుకు సాగేందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపాను" అని స్పష్టం చేశారు.
"ఏడు సార్లు నన్ను గెలిపించిన ప్రజల కోసం ఏదైనా చేస్తా. రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం చందూర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసింది. బాన్సువాడ నియోజకవర్గానికి పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా గుర్తుంచుకోవాలి. మంచిగా చేసిన వారిని మరువకూడదు" అని అన్నారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియోజకవర్గంలోని పెండింగ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ లు, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నానని పోచారం అన్నారు.
చందూర్ మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









إرسال تعليق