Top News

Minister Jupally | సంక్షేమం–అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

సంక్షేమం–అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

అర్హులందరికీ సొంతింటి కల సాకారం

రూ.30.32 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

440 డబుల్ బెడ్‌రూమ్ గృహాల ప్రారంభం

రాష్ట్రమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు

నిర్మల్, తెలంగాణ డైలీ న్యూస్, ప్రతినిధి:

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే సూత్రాన్ని అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు  పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  భైంసా పట్టణంలో ఆదివారం పర్యటించిన మంత్రి రూ.30.32 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పట్టణంలో నిర్మించిన 440 డబుల్ బెడ్‌రూమ్ గృహాలను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇంటి తాళాలు, గృహ పట్టాలను పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అమృత్ పథకం కింద రూ.28.18 కోట్లతో చేపట్టనున్న భైంసా పట్టణ తాగునీటి సరఫరా వ్యవస్థ ఆధునికీకరణ, కొత్త పైప్‌లైన్ల నిర్మాణం తదితర పనులకు భూమిపూజ నిర్వహించారు. రూ.2.14 కోట్లతో చేపట్టనున్న మహదేవ్‌పూర్ చెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే భైంసా పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు భూగర్భ జలాల మట్టాలు పెరిగి ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కార్యక్రమ ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం నిర్వహించిన గృహ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భైంసా అభివృద్ధికి నిధుల కొరత లేదని, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు కారణంగా నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అవినీతికి తావులేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు, కొత్త రేషన్ కార్డుల జారీ, త్వరలో కొత్త సామాజిక భద్రత పింఛన్ల మంజూరు వంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎంపీ జి. నగేష్ మాట్లాడుతూ భైంసా పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత పట్టణ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని పేర్కొన్నారు. అనంతరం ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు మంత్రి గృహ పట్టాలను అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, రాథోడ్ రమేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ దత్తాత్రి, వైస్ చైర్‌పర్సన్ కుతీజా సిద్ధిక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

--------------------------


దేశానికి దిక్సూచి పీవీ నరసింహారావు: మంత్రి జూపల్లి  

పీవీ 105వ జయంతి సందర్భంగా నిర్మల్‌లో ఘన నివాళి  

భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ చూపిన మహనీయుడని ప్రశంస  

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన మహా మనీషి పీవీ నరసింహారావు అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు.  

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పీవీ విగ్రహానికి మంత్రి జూపల్లి కృష్ణారావు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.  

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పీవీ నరసింహారావు కేవలం తెలంగాణకే కాకుండా యావత్ భారతదేశానికి మార్గదర్శకులని అన్నారు. దేశం అత్యంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ధైర్యవంతమైన నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారని పేర్కొన్నారు.  

నేడు ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడానికి పీవీ వేసిన సంస్కరణల పునాదులు ఎంతో కీలకమైనవని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వెడ్మ బొజ్జు, నారాయణ రావు పాటిల్, శ్రీహరి రావు, అప్పాల గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

----------------



మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు నివాళులు

భారత మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు 105 జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా నిర్మల్  శాంతినగర్ చౌరస్తాలో పి వి విగ్రహానికి నిర్మల్ బ్రాహ్మణ కరణం నియోగ సంఘ సభ్యులు పూల మాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డి భీమ్ రావు, ప్రధాన కార్యదర్శి కౌట్లేకర్ కిషోర్, రాజేశ్వర్ పాండే, గోవిందరావు, గిరీష్ కుమార్ పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post