పోలియో ను నిర్మూలిద్దాం
అందరి భాగస్వామ్యంతోనే నివారణ
కలెక్టర్ భవేష్ మిశ్రా
నిర్మల్, తెలంగాణ డైలీ ప్రతినిధి:
పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలియో వ్యాధిని నిర్మూలించేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి ప్రతి విడతలో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ వేయించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. గతంలో పోలియో చుక్కలు వేయించినా ప్రతి విడతలో మళ్లీ చుక్కలు వేయించడం ద్వారా పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తమ పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. జిల్లాలో ప్రతి ఒక్క చిన్నారి పోలియో చుక్కలు వేసుకునేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. పోలియో రహిత నిర్మల్ జిల్లా లక్ష్యంగా ప్రతి ఇంటికి అవగాహన కల్పించి వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని, ప్రజలు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రాజేందర్, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, వైద్య సిబ్బంది, చిన్నారులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment