హత్యాయత్నం కేసులో రౌడీ షీటర్ అరెస్ట్
తల్వార్ స్వాధీనం, రిమాండ్‌కు తరలింపు
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించం: డీఎస్పీ మధుసూదన్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 25: హత్యాయత్నం కేసులో కామారెడ్డి టౌన్ పోలీసులు రౌడీ షీటర్‌ను అరెస్టు చేసి తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ మధుసూదన్ వెల్లడించారు.
ఫిర్యాదుదారుడు మహమ్మద్ అర్షద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, గతంలో ఇంటి ప్రహరీ గోడ వివాదానికి సంబంధించి ఏర్పడిన పాత కక్షల నేపథ్యంలో నిందితుడు అబ్దుల్ సల్మాన్ ఖాన్ జూన్ 22 రాత్రి ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్లి, ఇంటి ముందు పార్క్ చేసిన ఆటో రిక్షా, విద్యుత్ మీటర్‌ను ధ్వంసం చేశాడు. అనంతరం ఫిర్యాదుదారుడు, అతని భార్యపై రాయితో దాడి చేసి గాయపరిచాడు. తల్వార్‌తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది.
ఫిర్యాదు ఆధారంగా కామారెడ్డి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు బతుకమ్మ కుంటలో పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తల్వార్‌తో బెదిరించి రాయితో దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు.నేరానికి ఉపయోగించిన 57 సెంటీమీటర్ల పొడవు గల తల్వార్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉండి నేరానికి ఉపయోగించినట్లు తేలడంతో భారత ఆయుధాల చట్టం 1959లోని సెక్షన్ 25(1B)(b)ను కూడా కేసులో చేర్చారు.
దర్యాప్తులో నిందితుడు అబ్దుల్ సల్మాన్ ఖాన్ కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన రౌడీ షీటర్ అని, గతంలో హత్యాయత్నం సహా వివిధ నేరాలకు సంబంధించి మొత్తం 5 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. ఆయా కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లిన చరిత్ర కూడా ఉన్నట్లు వెల్లడైంది.
డీఎస్పీ మధుసూదన్ మాట్లాడుతూ, శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులు, రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు ఎలాంటి నేరాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూండాగిరి, బెదిరింపులు, దాడులు, అక్రమ ఆయుధాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
హత్యాయత్నం కేసులో రౌడీషీటర్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీ నరహరి, ఎస్‌ఐ సాయికృష్ణ, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఇదే స్ఫూర్తితో విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారన్నారు.


إرسال تعليق