తెలంగాణ 12వ అవతరణ దినోత్సవం - కామారెడ్డి కలెక్టరేట్‌లో ఘనంగా వేడుకలు
ముఖ్య అతిథిగా హాజరైన సలహాదారు వి.హనుమంతరావు - జిల్లా ప్రగతి నివేదిక వెల్లడి
ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ వేడుకలు మంగళవారం ఉదయం 8.00 గంటలకు కామారెడ్డి IDOC (కలెక్టర్ కార్యాలయం)లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ & అభివృద్ధి సలహాదారులు వి.హనుమంతరావు హాజరయ్యారు.
జాతీయ పతాకావిష్కరణతో వేడుకలు ప్రారంభం
ఉదయం 8.00 గంటలకు ముఖ్య అతిథి వి.హనుమంతరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అయన వెంట జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగవాన్, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఎస్పీ రాజేష్ చంద్ర తదితరులు ఉన్నారు. అనంతరం ముఖ్య అతిథికి గౌరవ వందనం సమర్పించారు. ఉదయం 8.15 గంటలకు జిల్లా పురోగతిపై ముఖ్య అతిథి ప్రసంగించారు.
99 రోజుల ప్రజా పాలన - 10 లక్షల మందికి లబ్ధి
తన ప్రసంగంలో హనుమంతరావు కామారెడ్డి జిల్లా ప్రగతి నివేదికను వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పరిపాలనను వేగవంతం చేయడం, సంక్షేమ పథకాల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం 99 రోజుల పాటు "ప్రజా పాలన - ప్రగతి ప్రభాళిక" కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 10 లక్షిత నేపథ్య రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. అవి: పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఆర్అండ్బీ-ఆర్డబ్ల్యూఎస్, సంక్షేమం, బాలల భద్రత, వ్యవసాయం, విద్య, యువత-క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణం.
జిల్లాలో ముఖ్యమైన ప్రగతి
జిల్లాలో ఏప్రిల్ 2న గ్రామ సభలు, ఏప్రిల్ 16న మండల స్థాయి సమావేశాలు, మే 2న 3 నియోజకవర్గస్థాయిలలో, మే 3న ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, మే 22న జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించామని తెలిపారు. 9 వేల 448 ప్రభుత్వ భవనాలను శుభ్రపరచడం, 5 వేల 386 ఫిర్యాదుల పరిష్కారం జరిగిందన్నారు. 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య శిబిరాలు నిర్వహించి 4 వేల 170 మందికి వైద్యం అందించామన్నారు.
వ్యవసాయ రంగంలో: ప్రస్తుత యాసంగిలో 4 లక్షల 1 వేల 257 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి 839 కోట్ల 48 లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం. రైతు భీమా కింద 627 రైతుల నామినీలకు 31 కోట్ల 35 లక్షలు, రైతు భరోసా కింద 3 లక్షల 9 వేల 281 రైతులకు 220 కోట్ల 30 లక్షలు జమ చేశాం.
విద్యారంగంలో: 2025-26 విద్యా సంవత్సరంలో 13 వేల 119 మంది పదవ తరగతి పరీక్షకు హాజరు కాగా 12 వేల 787 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లా ఉత్తీర్ణత శాతం 97.47%. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద 758 విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పించి 2 కోట్ల 74 లక్షల ఫీజు చెల్లించాం.
మహిళా సాధికారత: జిల్లాలో 6 కోట్ల 98 లక్షల "0" టికెట్ల ద్వారా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాం. దీని ద్వారా మహిళలకు 240 కోట్ల 53 లక్షల లబ్ధి చేకూరింది. 973 పట్టణ మహిళా సంఘాలకు 2 కోట్ల 99 లక్షలు, 12 వేల 397 గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు 10 కోట్ల 92 లక్షల వడ్డీ లేని బుణాలు మంజూరు చేశాం.
గృహ నిర్మాణం: జిల్లాలో 11 వేల 616 ఇండ్లు మంజూరు కాగా, 10 వేల 848 ఇండ్ల నిర్మాణం ప్రారంభించాం. 1 వేయి 816 ఇండ్లు పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు లబ్ధిదారులకు 226 కోట్ల 14 లక్షలు చెల్లించాం.
పోలీసు శాఖ: రోడ్డు భద్రతా చర్యల ఫలితంగా 2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాలు 48 కేసులు, 50 మరణాలు తగ్గాయి. "Arive - Alive" రోడ్డు భద్రతా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నాం.
సాంస్కృతిక కార్యక్రమాలు, పత్రాల పంపిణీ
ఉదయం 9.00 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. 9.30 గంటలకు రెండవ విడత లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రములు పంపిణీ చేశారు. 9.40 గంటలకు స్టాల్స్ సందర్శన, 9.50 గంటలకు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పత్రిక విలేఖరులకు జిల్లా యంత్రాంగం ధన్యవాదాలు తెలిపింది.










Post a Comment