Attempt to Murder | 7 నెలల చిన్నారి హత్యాయత్నం కేసు ఛేదన

7 నెలల చిన్నారి హత్యాయత్నం కేసు ఛేదన

నేరాన్ని ప్రమాదంగా చిత్రీకరించే యత్నం 

తండ్రి, సవతి తల్లి అరెస్ట్ – “కుక్కలు ఎత్తుకెళ్లాయి” అన్న కథ బట్టబయలు  

ఎస్పీ రాజేష్ చంద్ర   పోలీసు బృందానికి అభినందనలు

బాన్సువాడ : బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 7 నెలల చిన్నారి వైష్ణవి హత్యాయత్నం కేసును బీర్కూర్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ దర్యాప్తుతో ఛేదించారు. చిన్నారి తండ్రి టేకు సతీష్, సవతి తల్లి సంకు శైలజను అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ  విఠల్ రెడ్డి  తెలిపారు.

ఘటన వివరాలు 

ఫిర్యాదుదారురాలు సంకు సంధ్య తెలిపిన ప్రకారం, సుమారు రెండేళ్ల క్రితం తన అక్క శైలజ భర్త టేకు సతీష్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరికి 7 నెలల కుమార్తె వైష్ణవి జన్మించింది. దాంపత్య విభేదాలతో విడిపోయి చిన్నారిని తండ్రి వద్ద ఉంచాలని నిర్ణయించారు.

తేది 15-07-2026 ఉదయం చిన్నారి ఇంట్లో కనిపించకపోవడంతో వెతకగా, ఇంటి సమీపంలోని ముళ్ల పొదల్లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో లభించింది. చిన్నారిని బాన్సువాడ, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల మీదుగా హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. (వీడియో 👇)


నేరాన్ని ప్రమాదంగా చిత్రీకరించే యత్నం 

దర్యాప్తులో చిన్నారిని పోషించడం భారంగా భావించి, కుటుంబ విభేదాల నేపథ్యంలో తండ్రి సతీష్, సవతి తల్లి శైలజ కలిసి అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నినట్లు తేలింది.

తేది 14-07-2026 అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న వైష్ణవిని ఇద్దరూ కలిసి తీసుకెళ్లి, సీసీ రోడ్డుపై ఈడ్చుకుంటూ కొంత దూరం తీసుకెళ్లారు. అనంతరం గడ్డి ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టి వెంట తెచ్చిన బ్లేడ్లతో శరీరంపై పలుచోట్ల గాయాలు చేశారు. చిన్నారి ఏడుపు ఆగిపోవడంతో చనిపోయిందని భావించి అక్కడే వదిలి ఇంటికి వెళ్లినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

మరుసటి రోజు ఉదయం చిన్నారి కనిపించడం లేదని గ్రామ పెద్దలకు చెప్పి, గ్రామస్తులతో కలిసి వెతుకుతున్నట్లు నటించారు. రాత్రి కుక్కలు ఎత్తుకెళ్లి గాయపరిచాయని పోలీసులు, బంధువులను నమ్మించే ప్రయత్నం చేశారు.

శాస్త్రీయ దర్యాప్తుతో అసలు నిజం బయటకు  

జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర ఆదేశాలతో, బాన్సువాడ డీఎస్పీ  విఠల్ రెడ్డి పర్యవేక్షణలో బాన్సువాడ రూరల్ సీఐ శ్రీ తిరుపయ్య, బీర్కూర్ ఎస్‌ఐ రాములు, పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు మరియు సిబ్బంది ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా అసలు వాస్తవాలను రాబట్టి నిందితులను అరెస్ట్ చేశారు.

*అరెస్టైన నిందితులు*

1.  *టేకు సతీష్* - చిన్నారి వైష్ణవి తండ్రి

2.  *సంకు శైలజ* - చిన్నారి సవతి తల్లి

*స్వాధీనం చేసుకున్న వస్తువులు*  

1. ఒక Redmi క్రీమ్ కలర్ స్మార్ట్‌ఫోన్  

2. ఒక Karbonn కీప్యాడ్ మొబైల్ ఫోన్

ఈ సంచలన కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర అభినందించారు.


Post a Comment

Previous Post Next Post