BRS Protest | వైద్యుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా

వైద్యుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో  ధర్నా  

సిజేరియన్ తర్వాత 5గురు బాలింతలు అస్వస్థత, 3 మందికి డయాలసిస్  

24 గంటల వైద్య సేవలు, మందులు, ప్రత్యేక వార్డులు కావాలని డిమాండ్

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ :

బాన్సువాడ మాత శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింతలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు ఖలీల్ మాట్లాడుతూ గత శుక్రవారం, శనివారం రెండు రోజుల్లో పదిమంది గర్భిణీలకు సిజేరియన్ ఆపరేషన్లు చేశారని చెప్పారు. వారిలో ఐదుగురు బాలింతలు ఆపరేషన్ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వారికి రక్తం ఎక్కించాలని సూచించినా, ఎక్కించలేదని దీంతో రక్త కణాలు పడిపోయాయని ఆరోపించారు. అ తర్వాత కిడ్నీలో వాపు వచ్చిందని, సూపరింటెండెంట్ వారిని ముందు నిజామాబాద్ కు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాల్సి వచ్చిందని అన్నారు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ సోకడంతో ముగ్గురికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇదంతా ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపించారు.

గత కొన్ని రోజులుగా మాత శిశు ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు కూడా లేవని ఆయన విమర్శించారు. డాక్టర్లు సకాలంలో అందుబాటులో ఉండటం లేదని, అవసరమైన మందులు స్టాక్ లో లేవని, గర్భిణీలకు, నవజాత శిశువులకు చేయాల్సిన టెస్టులు, టీకాలు సరిగా జరగడం లేదని అన్నారు. డాక్టర్లు ఒంటి గంట తర్వాత తమ క్లినిక్ లను నిర్వహిస్తున్నారని అన్నారు. నీటి వసతి లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం "ఆరోగ్యమే మహాభాగ్యం" అని చెప్తున్నప్పటికీ, మా తల్లులు, పసిపిల్లలు ఆసుపత్రికి వస్తే నిరాశతో వెనుకకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Mother & Child Health Center లో 24 గంటలూ డాక్టర్ మరియు సిబ్బందిని నియమించాలని,  అవసరమైన అన్ని మందులు, వైద్య పరికరాలను వెంటనే సరఫరా చేయాలని,  గర్భిణీ స్త్రీలకు, నవజాత శిశువులకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, బాడి శ్రీనివాస్, ఖలీల్, అక్బర్, ఫిరోజ్, గణేష్, సుధాకర్ యాదవ్  తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా టౌన్ సి ఐ శ్రీధర్ పోలీస్ బందోబస్త్ నిర్వహించారు.

వీడియో 👇


https://youtube.com/shorts/DqsNm3fcY8w?si=NuZv2LsR97lwHBKp

Post a Comment

Previous Post Next Post