వర్షాభావ నేపథ్యంలో తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
సింగూర్‌లో 4.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది: కలెక్టర్ వెల్లడి
90 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలి
స్థానిక తాగునీటి వనరులు వెంటనే గుర్తించాలని అధికారులకు ఆదేశం
ప్రతి మండలంలో తాగునీటి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలి
ఫామ్‌పాండ్లు, సోక్‌పిట్ల అభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలి
కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సింగూర్ జలాశయంలో ప్రస్తుతం సుమారు 4.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, ఈ నిల్వలతో రానున్న 90 రోజుల పాటు తాగునీటి అవసరాలను తీర్చే అవకాశం ఉందని తెలిపారు.
అయినప్పటికీ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. సింగూర్ నుంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన పక్షంలో స్థానికంగా అందుబాటులో ఉన్న తాగునీటి వనరులను వెంటనే గుర్తించాలని ఆదేశించారు.
ప్రతి మండలంలో తాగునీటి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో ఫామ్‌పాండ్లు, సోక్‌పిట్లు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు వంటి నీటి వనరుల అభివృద్ధి పనులను గుర్తించి, వాటి అమలుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తదుపరి సమీక్ష సమావేశానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన చర్యలను ముందుగానే చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.

Post a Comment