ఎల్లారెడ్డి మైనారిటీ కళాశాల తరలింపుపై అఖిలపక్షం ఆగ్రహం
ప్రజావాణిలో RDO కు ఫిర్యాదు
"కళాశాలను ఎల్లారెడ్డి నుంచి తరలించే ప్రసక్తే లేదు"
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మైనారిటీ వెల్ఫేర్ జూనియర్ కళాశాలను లింగంపేటకు తరలించడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష నాయకులు, ముస్లిం సంక్షేమ సంఘ సభ్యులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
RDO ప్రభాకర్‌కు వినతి పత్రం అందజేసిన అఖిలపక్ష నాయకులు తరలింపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"శిథిల భవనం సాకుతో తరలింపు"
ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని మైనారిటీ జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థలో ఉందన్న సాకుతో అకస్మాత్తుగా లింగంపేటకు తరలించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
కళాశాల భవనం ఇంకా ఐదు సంవత్సరాల వరకు వినియోగించేందుకు అనుకూలంగా ఉందని నిపుణులు చెప్పారని, ప్రస్తుతం ప్రైవేట్ భవనాన్ని ఎంచుకున్నారని తెలిసిందని వారు తెలిపారు. ఆ భవనంలో అన్ని వసతులు రావడానికి సమయం పడుతుందని సమాచారం ఉందన్నారు.
తాత్కాలిక ప్రత్యామ్నాయం సూచన
పట్టణ కేంద్రంలోని మదర్సా పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయని, కళాశాల నిర్వహణకు తాత్కాలికంగా ఆ భవనాన్ని వినియోగించుకోవడానికి తాము అంగీకరించామని నాయకులు చెప్పారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే కళాశాలను లింగంపేటకు తరలించారని ఆరోపించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ కళాశాలను ఎల్లారెడ్డి నుంచి తరలించేందుకు వీలు లేదని, అలా చేస్తే అఖిలపక్షం ఆధ్వర్యంలో తరలింపు నిర్ణయాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో BRS పట్టణ మాజీ అధ్యక్షులు ఆదిమూలం సతీష్ కుమార్, మదర్సా నిర్వహణ అధ్యక్షులు ఎజాజ్ మసూద్, BJP రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్, MIM పట్టణ అధ్యక్షులు రజాక్, DSP నాయకుడు సాయిలు, మైనారిటీ నాయకులు ఇమ్రాన్, బర్కత్, యూనిస్, అమీర్, అజముల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment