Top News

Harish Rao | "మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే"


"మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే"  

సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల కోసం పాదయాత్రకు పిలుపు  

SIR పై అప్రమత్తత అవసరం - కార్యకర్తలకు దిశానిర్దేశం  

రైతు డిస్కం పేరుతో కరెంట్ కోతలకు కుట్ర - హరీశ్ ఆరోపణ

ఆందోల్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ రావు  

తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో దాస శ్రీనివాస్/సంగారెడ్డి

ఆందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం, పార్టీ సభ్యత్వ నమోదు, SIR ఓటరు జాబితా సవరణ అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

"మళ్లీ కేసీఆర్ సర్కారే"  

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎత్తు, పొడుగు గురించి మాట్లాడుతున్నారని, తాను సబ్జెక్ట్ పై మాట్లాడుతున్నానని హరీశ్ రావు అన్నారు.  

"ఇటు సూర్యుడు అటు మొలిచినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే. భూమి బద్దలైనా తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే. ఏవి పాలు, ఏవి నీళ్లు అనేది ప్రజలకు అర్థమైంది" అని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు.

ప్రాజెక్టుల సాధన కోసం పాదయాత్ర  

ఆందోల్ ప్రాంతానికి ప్రాణాధారమైన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి నిలిపివేశారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల సాధన కోసం త్వరలో బోరంచి అమ్మవారి ఆలయం నుంచి సిద్ధి వినాయక ఆలయం వరకు భారీ పాదయాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. వర్షాలు తగ్గగానే కార్యకర్తలు, నాయకులు పాదయాత్రకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

SIR ప్రక్రియపై కీలక సూచనలు  

SIR ప్రక్రియలో ఓట్ల గల్లంతుపై కుట్రలు జరుగుతున్నాయని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్, అస్సాం, తమిళనాడులో ఇలాగే జరిగిందని ఉదాహరణలు ఇచ్చారు.  

ఈ నెల 25వ తేదీ లోపు ఎన్యూమరేషన్ ఫారం నింపి, 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు జతచేసి BLOకు ఇవ్వాలని సూచించారు. 2002లో ఓటు ఉన్నవారు ఎడమవైపు, లేనివారు కుడివైపు ఫారం నింపాలని, ఫ్యామిలీ వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కంటికి రెప్పలా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

రైతు వ్యతిరేక విధానాలు  

కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే, దాన్ని తగ్గించి 7-8 గంటలు మాత్రమే ఇచ్చేందుకు 'రైతు డిస్కం' పేరుతో రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.  

రైతులకు ఇవ్వాల్సిన 19 వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టారని, 2 లక్షల రుణమాఫీ సరిగ్గా జరగలేదని, యూరియా యాప్‌తో ఇబ్బందులు సృష్టిస్తున్నారని, 6 నెలల నుంచి రైతు బీమా రాలేదని విమర్శించారు.  సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తు చేయలేని అసమర్థ ప్రభుత్వమని, వెంటనే క్రాప్ హాలిడే ప్రకటించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంక్షేమ పథకాల రద్దు  

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ, దళితబంధు, ముదిరాజ్‌లకు ఉచిత చేప పిల్లల పథకాలను బంద్ చేసిందని ఆరోపించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా అమలు కాలేదని ఎద్దేవా చేశారు.  

కుంభకోణాలపై ఆరోపణలు  

కోడిగుడ్లు, స్కూల్ బ్యాగులు, టైల కొనుగోళ్లలో, గురుకుల టెండర్లలో భారీ కుంభకోణాలు జరిగాయని అన్నారు. చర్చకు రావాలంటే పోలీసులతో అడ్డుకుంటున్నారని, ఇది ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

చివరగా కార్యకర్తలు అధైర్యపడొద్దని, అందరం కష్టపడి బీఆర్ఎస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.





Post a Comment

Previous Post Next Post