పెండింగ్ DA, కొత్త PRC వెంటనే ప్రకటించాలని డిమాండ్
TETలో సోషల్ స్టడీస్ తొలగించి హిందీ చేర్చాలని కోరిక
బాన్సువాడ :రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ - RUPP(TG) ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో హిందీ భాష పండితులు నిరసన చేపట్టారు.
బాన్సువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మూడు రోజుల హిందీ భాష శిక్షణ కేంద్రంలో అల్ప విరామ సమయంలో పండిత పరిషత్, TTU ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ప్రభుత్వంపై ప్రధాన డిమాండ్లు
ఈ సందర్భంగా RUPP(TG) కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నార్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న DAలను, కొత్త PRCను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. CPSను రద్దుచేసి OPSను అమలు చేయాలని, GO 317 కారణంగా ఇతర జిల్లాల్లో ఉన్న ఉపాధ్యాయులకు తమ సొంత జిల్లాకు బదిలీ అయ్యేలా మార్గదర్శకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
హిందీ పండితుల సమస్య
హిందీ భాష పండితులకు TETలో సంబంధంలేని సోషల్ స్టడీస్ సబ్జెక్టును తొలగించి, హిందీ భాషకు సంబంధించిన అంశాన్ని చేర్చాలని ఆయన కోరారు. సాంఘిక శాస్త్రం సంబంధంలేని సబ్జెక్టు ఉండడం వల్ల హిందీ పండితులు ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో RUPP(TG) జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్, TTU జిల్లా ప్రధాన కార్యదర్శి కాంప్లె గోపాల్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్క నరహరి, DRPలు, నర్సింలు, వివిధ మండలాల భాషా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Post a Comment