Joinings in BRS | బాన్సువాడలో బీఆరెస్ దూకుడు

బాన్సువాడలో బీఆరెస్ దూకుడు  

ఏనుగు వర్గం కాంగ్రెస్‌కు దూరం

కసరత్తుతో ఖాళీ అవుతున్న ఏనుగు వర్గం, బీఆరెస్‌లో వలసలు

బాన్సువాడ: అధికార కాంగ్రెస్ పార్టీలో  ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి వర్గంలో నాయకుల సంఖ్య తగ్గుతోంది. గతంలో కాంగ్రెస్‌లో చేరిన ఆ వర్గ నేతలు ఒక్కొక్కరుగా బీఆరెస్ వైపు వలస వెళ్తున్నారు. దీంతో బాన్సువాడ నియోజకవర్గంలో బీఆరెస్ లో వలసలు పెరుగుతున్నాయి.

వరుస వలసలు

గత కొన్ని నెలల క్రితం జరిగిన మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే కొందరు ఏనుగు వర్గీయులు కాంగ్రెస్‌ను వీడి బీఆరెస్‌లో చేరారు. తాజాగా బాన్సువాడ మండలానికి చెందిన  పారిశ్రామికవేత్త శ్రీనివాస్ రావు సోమవారం బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆరెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు భారీగా కొందరు నాయకులు బీఆరెస్ లో చేరుతున్నట్లు సమాచారం.

ఈ నేత గతంలో బాన్సువాడలోని కొందరు కౌన్సిలర్లతో కలిసి బీఆరెస్ నుంచి ఏనుగు నాయకత్వంలో కాంగ్రెస్‌లోకి వచ్చారు. అప్పట్లో పలు కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే బీఆరెస్ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరడంతో ఈ నేతలు కాంగ్రెస్‌కు అంటీముట్టనట్లుగా ఉన్నారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏనుగు వర్గంతో కలిసి వచ్చిన అప్పటి కౌన్సిలర్లకు టికెట్ లభించకపోవడంతో వారు తిరిగి బీఆరెస్‌లో చేరారు. వీరితో పాటు వర్ని, కోటగిరి మండలాలకు చెందిన కొందరు నేతలు కూడా బీఆరెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఆ పారిశ్రమిక వేత్త సైతం బీఆరెస్ లో చేరుతున్నారు.

2018లో నియోజకవర్గంలోగ్రామాల్లో బీఆరెస్ పార్టీ బలం 

ఇంచార్జిపై ఒత్తిడి, పార్టీ వ్యూహం 

ప్రస్తుతం బీఆరెస్ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్, బాన్సువాడ రెండు నియోజకవర్గాలను చూసుకోవడం కష్టంగా మారింది. నియోజకవర్గ ఇంచార్జిగా బాన్సువాడ నుంచే స్థానిక నాయకుడు ఎదగాలని ఆయన పలు సమావేశాల్లో సూచించారు. 

ఇటీవల నిజామాబాద్ రూరల్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి రూరల్‌లోనే ఉంటారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బాన్సువాడలో పార్టీని బలోపేతం చేయడానికి అధిష్టానం అచితూచి వ్యవహరిస్తోంది.

కాంగ్రెస్ నుంచి వలసల కోసం ఎదురుచూస్తూనే కొత్త వారిని ఇక్కడ నియమించాలనే ఆలోచనలో బీఆరెస్ ఉంది. ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు ఒక్కొక్కరు బీఆరెస్‌లోకి వెళ్తున్న నేపథ్యంలో చివరికి ఏనుగు కూడా ఆ పార్టీలో చేరే అవకాశం ఉందనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

బీఆరెస్‌ను బలోపేతం చేసేందుకు పార్టీ అన్ని రకాల చర్యలు చేపట్టింది. కాంగ్రెస్‌లో  అసంతృప్తితో ఉన్న నేతలను ఆకర్షించి బాన్సువాడలో పార్టీ పునాదులను పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

Post a Comment

Previous Post Next Post