Top News

Land's Lucky Draw | రూ.999తో భూమి అనే ప్రచారం మోసం: కామారెడ్డి పోలీసులు

రూ.999తో భూమి అనే ప్రచారం మోసం: కామారెడ్డి పోలీసులు  

అక్రమ లక్కీ డ్రా నిర్వహించిన వ్యక్తిపై కేసు, బుక్కులు, సెల్‌ఫోన్ స్వాధీనం  

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచన  

ప్రభుత్వ అనుమతులు లేకుండా లక్కీ డ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు  

కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:  

ప్రభుత్వ అనుమతులు లేకుండా లక్కీ డ్రాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా పోలీసులు హెచ్చరించారు. రూ.999 చెల్లిస్తే భూమి వస్తుందనే ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.  

సదాశివనగర్ గ్రామానికి చెందిన సింగరాయపల్లి రమేష్ తనకు చెందిన సర్వే నెం.108/1/2లో ఉన్న 19 గుంటల పట్టా భూమిని లక్కీ డ్రా ద్వారా విక్రయిస్తానంటూ సోషల్ మీడియా,  గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం సదాశివనగర్ పోలీసులకు అందింది. ఒక్కో వ్యక్తి నుంచి రూ.999 చొప్పున వసూలు చేసి రసీదులు జారీ చేస్తున్నట్లు సమాచారం.  

కేసు నమోదు, సామగ్రి స్వాధీనం  

సమాచారం అందుకున్న వెంటనే సదాశివనగర్ ఎస్సై పుష్ప రాజు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విచారణలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే లక్కీ డ్రా స్కీం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అనుమతులకు సంబంధించిన పత్రాలు చూపించాలని కోరగా, సంబంధిత వ్యక్తి తన వద్ద ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని అంగీకరించాడు.  

దీంతో లక్కీ డ్రాకు సంబంధించిన 6 బుక్కులు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తిపై సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  




మోసపూరిత ప్రచారాలను నమ్మవద్దు  

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలను ఆకర్షించే పేర్లతో నిర్వహించే అనుమతి లేని లక్కీ డ్రాలు, పెట్టుబడి పథకాలు, బహుమతి స్కీములు మరియు ఇతర మోసపూరిత కార్యక్రమాలు పూర్తిగా చట్టవిరుద్ధమైనవని తెలిపారు.  

రూ.999 కట్టి లక్షల విలువైన భూమి వస్తుంది, చిన్న పెట్టుబడితో భారీ లాభాలు, లక్కీ డ్రాలో ఖచ్చితంగా బహుమతి వంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఇలాంటి స్కీముల వెనుక మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, డబ్బు చెల్లించే ముందు తప్పనిసరిగా సంబంధిత ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించుకోవాలని కోరారు.  

అమాయక ప్రజలను లక్కీ డ్రాలు, స్కీములు లేదా ఇతర మోసపూరిత పథకాల పేరుతో మోసం చేసే వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిర్వహించే వారు మాత్రమే కాకుండా, తెలిసి వాటిలో భాగస్వామ్యం అయ్యే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.  

ప్రజలు తమ పరిసరాల్లో ఇలాంటి అక్రమ లక్కీ డ్రాలు, మోసపూరిత స్కీములు లేదా అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా జిల్లా పోలీసులకు సమాచారం అందించి నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని ఎస్పీ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post