Top News

Police Alert | సదాశివనగర్ పోలీసుల సమయస్ఫూర్తితో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం


ప్రయివేట్ బస్సు టైర్ పగిలి అదుపు తప్పిన సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ అప్రమత్తం అయిన సిసి ఫుటెజీ 

సదాశివనగర్ పోలీసుల సమయస్ఫూర్తితో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం

క్షణాల్లో స్పందించి పలువురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్, హోంగార్డు

తెలంగాణ డైలీ న్యూస్,  కామారెడ్డి: సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్కల్ ఎక్స్ రోడ్ వద్ద ఈరోజు సాయంత్రం 5:23 గంటలకు సంభవించేందుకు సిద్ధంగా ఉన్న ఘోర రోడ్డు ప్రమాదాన్ని సదాశివనగర్ పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో నివారించారు.

కామారెడ్డి నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సుకు అకస్మాత్తుగా వెనుక టైర్ బ్లాస్ట్ అయింది. దీంతో బస్సు అదుపు తప్పే పరిస్థితి ఏర్పడి, వెనుక నుంచి వేగంగా వస్తున్న కారును ఢీకొట్టే ప్రమాదం కనిపించింది.ఆ సమయంలో ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సదాశివనగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రంజిత్, హోంగార్డు వేణు వెంటనే స్పందించారు. రహదారిపై ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు, బస్సు వెనుక నుంచి వస్తున్న కారును సకాలంలో ఆపి మరో ప్రమాదాన్ని నివారించారు. (సీసీ ఫుటెజీ 👇)


పోలీసుల వేగవంతమైన చర్యలతో బస్సులోని ప్రయాణికులు, కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటన స్థలంలో ఉన్న స్థానికులు "పోలీసులు వెంటనే స్పందించకపోయి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది" అని అన్నారు.

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం  

ప్రజల ప్రాణాలను కాపాడటంలో పోలీసుల అప్రమత్తత, విధి నిర్వహణ పట్ల అంకితభావం మరోసారి రుజువైందని జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. చట్ట అమలుతో పాటు ప్రజల భద్రతే ప్రధాన బాధ్యతగా భావిస్తూ కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రతి పరిస్థితిలో ప్రజలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

వాహనదారులకు సూచనలు 

ఈ సందర్భంగా సదాశివనగర్ పోలీసులు వాహనదారులకు పలు సూచనలు చేశారు. ప్రయాణానికి ముందు వాహనాల సాంకేతిక పరిస్థితిని తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, టైర్లు, బ్రేకులను నిర్లక్ష్యం చేయవద్దని, అతివేగానికి దూరంగా ఉండి ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.  

ప్రజల భద్రత కోసం కామారెడ్డి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా సేవలందిస్తూనే ఉంటారని అధికారులు స్పష్టం చేశారు.





Post a Comment

Previous Post Next Post