బాన్సువాడ ఎస్సీ గురుకుల హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య ఘటనతో.....
వార్డెన్ పై సస్పెన్షన్ వేటు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలికల గురుకుల వసతి గృహంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనలో వార్డెన్ నిర్లక్ష్యం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో వార్డెన్ మమతను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
విచారణలో నిర్లక్ష్యం
ఈ ఘటనపై బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్ లు విచారణ జరిపి నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం వార్డెన్ మమతను సస్పెండ్ చేశారు.
ఘటన వివరాలు
మృతురాలు వారం రోజుల క్రితమే బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్‌లో చేరి, టీచర్స్ కాలనీలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉంటోంది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, నాన్నను విడిచి హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక, హోంసిక్‌తో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని తన నోట్ బుక్‌లో కూడా రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజులుగా అనారోగ్యంతో ఉన్న తండ్రి మైసయ్యకు "నాన్నను చూడాలని ఉంది" అని ఫోన్ చేసింది. బుధవారం కళాశాలకు వెళ్లకుండా గదిలో ఉరేసుకుంది. ఆ సమయంలో వచ్చిన తండ్రి తలుపులు పగలగొట్టి చూసేసరికే మృతి చెందింది. ఆ సమయంలో వార్డెన్ అందుబాటులో లేరు
మరోవైపు విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాత్రం వేరే కోణం చెబుతున్నారు. "హాస్టల్‌లో ఉండేందుకు వార్డెన్ రూ.10 వేలు డిమాండ్ చేశారు. వార్డెన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగింది" అని ఆరోపిస్తున్నారు.
======================
ఇందిరమ్మ ఇళ్ల పురోగతిలో నిర్లక్ష్యం: బాన్సువాడ ఎంపీఓ సరెండర్
బాన్సువాడ: పంచాయతీరాజ్ శాఖలో బాన్సువాడ ఎంపీఓగా విధులు నిర్వర్తిస్తున్న నాగరాజును కమిషనర్‌కు సరెండర్ చేయాలంటూ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
మొదట మాచారెడ్డి ఎంపీఓగా ఉన్న నాగరాజు కొన్ని నెలల కిందట పిట్లం మండలానికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఆ తర్వాత నెల కిందట బాన్సువాడకు డిప్యూటేషన్‌పై బదిలీ అయ్యారు.
పిట్లం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిలో వెనుకబడి ఉండటంతో ఈ సరెండర్ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ మాట్లాడుతూ కలెక్టర్ ఎంపీఓను సరెండర్ చేసినట్లు తెలిపారు.

Post a Comment