ఆదర్శ పాఠశాల/కళాశాలలో విద్యార్థినుల వేధింపుల కేసు
ఇద్దరు కాంట్రాక్ట్ లెక్చరర్ల శాశ్వత తొలగింపు
1098 కు ఫిర్యాదు, DCPO ఆధ్వర్యంలో విచారణ
నిందితులపై కేసు నమోదు
బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కొత్తబాది ఆదర్శ పాఠశాలలో ఇంటర్ విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇద్దరు కాంట్రాక్ట్ లెక్చరర్లను విధుల నుండి శాశ్వతంగా తొలగించారు.
ఫిర్యాదు, విచారణ
పవన్, గోపాల్ అనే ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయులు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థినులు 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు భరించలేక ఉన్నత అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. వీడియో 👇
ఫిర్యాదు అందిన వెంటనే DCPO ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో జిల్లా విద్యాధికారి మల్లికార్జున్ ఇద్దరు లెక్చర్లను విధుల నుండి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీసు చర్యలు
ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపల్ కమల్ కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పవన్, గోపాల్ లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
కొంతమంది ఉపాధ్యాయులు ఈ విషయాన్ని బయటకు రాకుండా సద్దుమణిచేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు రావడంతో విద్యాశాఖ దానిపై కూడా దృష్టి సారించింది.
విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత అత్యంత ప్రధానమని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థినుల పట్ల ఎలాంటి వేధింపులకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తల్లిదండ్రులు, విద్యార్థులకు విజ్ఞప్తి
తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎప్పటికప్పుడు మాట్లాడాలి. పాఠశాలలో లేదా కళాశాలలో ఏవైనా సమస్యలు, వేధింపులు ఉంటే వెంటనే పాఠశాల యాజమాన్యానికి, 1098 కు లేదా సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని విద్యాశాఖ కోరింది.



Post a Comment