నిర్మల్ లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
రద్దీ సమయాల్లో విస్తృతంగా తనిఖీలు
నెల రోజులు ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్
నిర్మల్, తెలంగాణ డైలీ న్యూస్:
నిర్మల్ జిల్లా కేంద్రంలో రోజురోజుకూ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రణ కోసం పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలను చేపట్టింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఎస్పీ డా. జి. జానకి షర్మిల పట్టణంలోని బస్టాండ్ పరిసరాలు, మయూరి హోటల్ జంక్షన్, మంచిర్యాల చౌరస్తా, ఈద్గా చౌరస్తా ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులను శుక్రవారం పరిశీలించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో టౌన్ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య, రూరల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, ఆర్‌ఐలు రామ్ నిరంజన్, రామకృష్ణతో పాటు ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది ఉంటారు. ఈ ప్రత్యేక బృందం నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించనుంది. (వీడియో 👇)
రోడ్లపై ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను పార్కింగ్ చేయడం, రహదారులపై ఆక్రమణలు ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణమని ఎస్పీ పేర్కొన్నారు. పండ్ల దుకాణాల యజమానులు, చిరు వ్యాపారులు, ఆటో స్టాండ్ నిర్వాహకులు, వాహనదారులు పోలీసులకు సహకరిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు.నిర్మల్ పట్టణానికి ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరైనా పూర్తిస్థాయిలో ప్రారంభం కావడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. అప్పటి వరకు ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Post a Comment