Top News

Treatment in NIMS | నిమ్స్ కు మిగతా ఇద్దరు బాలింతలు

నిమ్స్ కు మిగతా ఇద్దరు బాలింతలు 

వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తు ఆదేశాలు 

సిజేరియన్లు వికటించిన ఘటనపై నిమ్స్ ప్రొఫెసర్లతో విచారణ 

వైద్యుల నిర్లక్ష్యమా? కుట్ర కోణమా? అనే అనుమానాలు

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో శుక్ర, శనివారాల్లో చేసిన 5 సిజేరియన్ ఆపరేషన్లు వికటించడంతో బాలింతలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను కదిలించింది. సోమవారం ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్ కు తరలించగా, మంగళవారం మిగితా ఇద్దరినీ నిమ్స్ కు తరలించారు.  ప్రస్తుతం  ఐదుగురు హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

నిమ్స్‌లో ప్రత్యేక బృందంతో చికిత్స  

వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తు ఆదేశాలతో ఇప్పటికే నిమ్స్‌లో చికిత్స పొందుతున్న హుమేరా ఫాతిమా, రుక్సానా, జ్యోతితో పాటు మంగళవారం సాయంత్రం లక్ష్మి ప్రియ, సునీతలను నిజామాబాద్ నుంచి నిమ్స్‌కు తరలించారు. 5గురికీ ఒకే చోట మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వీరికి డయాలసిస్ చేస్తూ ICUలో చికిత్స అందిస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా అధికారులతో మాట్లాడి సూచనలు ఇస్తున్నారు.

నిమ్స్ ప్రొఫెసర్లతో కారణాలపై విచారణ 

ఒకేసారి 5గురు బాలింతలు ఒకే రకమైన సమస్యతో అస్వస్థతకు గురవడంపై ప్రిన్సిపల్ సెక్రటరీ సీరియస్‌గా స్పందించారు. కారణాలను కనుగొనేందుకు మంగళవారం  ఇద్దరు ప్రొఫెసర్లను, డైరెక్టర్ ను నిమ్స్ కు పంపారు.వారు బాధితుల ఆరోగ్యాన్ని, వాడిన మందులు, శస్త్ర చికిత్స విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే బాన్సవాడకు వచ్చి ఇక్కడి ఆపరేషన్ థియేటర్ ను, సిజెరియన్ కు వాడిన పరికరాలను పరిశీలించారు. సిబ్బంది తో మాట్లాడారు. వివిధ మందులు, పరికరాలను ల్యాబ్ టెస్ట్ నిమిత్తం హైదరాబాద్ కు తీసుకెళ్లారు.

ఆసుపత్రి ప్రతిష్టపై చర్చ 

బాన్సువాడ ఏరియా ఆసుపత్రి చరిత్రలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి. జాతీయ, రాష్ట్రస్థాయి కాయకల్ప అవార్డులు పొందిన ఈ ఆసుపత్రికి బాన్సువాడతో పాటు ఎల్లారెడ్డి, జుక్కల్, నారాయణఖేడ్, బోధన్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా రోగులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి పేరు ప్రతిష్టను దిగజార్చేందుకు ఎవరైనా కుట్ర చేశారా అనే చర్చ స్థానికంగా జరుగుతోంది. మత్తు మందు ఓవర్‌డోస్ అయిందా? లేదా సూపరింటెండెంట్‌ను టార్గెట్ చేసి కావాలనే ఇలా చేశారా? అనే కోణాల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ అంశంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయభాస్కర్  స్పందిస్తూ "ఐదుగురు బాలింతలు నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యేక వైద్య బృందాన్ని కేటాయించారు. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. సిజేరియన్లు వికటించడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. కావాలని ఎవరైనా చేశారా అనేది నాకు తెలియదు" అని తెలిపారు.

పూర్తిస్థాయి విచారణ నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం తెలిసే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post