Top News

Video Confererence | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ తో జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ తో జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్  

ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం  

త్రాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి  

ప్రజాపాలన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి  

పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ లక్ష్యాలు పూర్తి చేయాలి

కామారెడ్డి: గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు డా బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్రాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, విద్య, వాతావరణ పరిస్థితులు, ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక తదితర అంశాలపై సమీక్షించారు.

ఎల్ నినో పరిస్థితులపై చర్యలు  

ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల మార్పిడి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.

జిల్లా స్థాయిలో సమీక్ష  

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐడిఓసి నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల జిల్లా అధికారులతో పాల్గొన్నారు. అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ప్రణాళిక బద్దంగా పని చేయాలని అన్నారు.

రైతులకు అవగాహన కల్పించాలి  

ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు వివరించాలని సూచించారు. వరికి బదులుగా తక్కువ నీటితో మెట్టపంటలు, కూరగాయలు, ఉద్యానవన పంటలు పండించేలా చైతన్యపరచాలని చెప్పారు. రైతువేదికల ద్వారా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులతో కలిసి రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

విద్య, పారిశుధ్యంపై దృష్టి  

టార్గెట్ ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీ ల పరిసరాల్లో దోమలు పెరగకుండా గ్రామ పంచాయతీల ద్వారా చెత్త తొలగించి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

త్రాగునీటి సరఫరా, దరఖాస్తుల పరిష్కారం  

వర్షాభావ పరిస్థితుల్లో త్రాగునీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసేలా ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలు పరిశీలించి గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల వారీగా పరిష్కరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post