అసూయతో మహిళ హత్య !
కామారెడ్డి టౌన్ పోలీసుల చాకచక్యంతో కేసు ఛేదన
సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడు అరెస్ట్
రైల్వే ట్రాక్ వద్ద రాయి తో కొట్టి హత్య
జిల్లా ఎస్పీ ప్రశంసలు
కామారెడ్డి: అసూయ కారణంగా మహిళను హత్య చేసిన కేసును కామారెడ్డి టౌన్ పోలీసులు శాస్త్రీయ దర్యాప్తుతో ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు డిఎస్పీ వెల్లడించారు.
ఘటన నేపథ్యం
పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం రాజం 31.05.2026న తన భార్య నర్సాపురం శ్యామల కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. ఆ రోజు ఇద్దరూ కూలి పనుల కోసం కామారెడ్డికి వచ్చారు. భర్తకు పని దొరకగా భార్యకు పని దొరకలేదు. కూరగాయలు కొని ఇంటికి రమ్మని చెప్పి అతను వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో పోలీసులను ఆశ్రయించాడు.
అదృశ్య కేసు హత్యగా మార్పు
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS ఆదేశాల మేరకు, డీఎస్పీ పర్యవేక్షణలో, టౌన్ సీఐ బి. నరహరి ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి.
03.06.2026న గ్రీన్ సిటీ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు దానిని శ్యామలగా గుర్తించారు. తలపై తీవ్ర గాయాలు ఉండటంతో కేసును హత్యగా నమోదు చేశారు.వీడియో 👇
అసూయతో హత్య చేసినట్లు నిందితుడి అంగీకారం
సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. 17.07.2026న లేబర్ అడ్డా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న పిట్ట నర్సింలు @ పిట్టల నర్సింలు, శిరాన్ పల్లి, నవీపేట్ మండలం, నిజామాబాద్ జిల్లాను అదుపులోకి తీసుకున్నారు. మొదట తప్పుడు పేరు చెప్పినప్పటికీ విచారణలో అసలు వివరాలు వెల్లడించాడు.
విచారణలో నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం:
శ్యామలతో కొంతకాలంగా పరిచయం ఉంది. కలిసి కూలి పనులకు వెళ్లేవారు. ఆమెకు తరచూ డబ్బులు ఇస్తూ ఉండేవాడు. ఆమె మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి అసూయ పెంచుకున్నాడు.
03.06.2026న గ్రీన్ సిటీ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి మద్యం సేవించిన తర్వాత గొడవ జరిగింది. కోపంలో రాయితో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ తీసుకొని రూ.200 లకు అమ్మి ఆ డబ్బుతో మద్యం కొన్నాడు.
నిందితుడి గత చరిత్ర
విచారణలో నిందితుడు గతంలో కూడా కూలీలను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి దోపిడీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. నిజామాబాద్ నాలుగో టౌన్ లో దోపిడీ కేసు, బాసరలో హత్య కేసు ఉండి, బెయిల్ పై ఉన్నట్లు తేలింది. ఆ కేసుల్లో "మామిడి రాజన్న" పేరుతో తిరిగినట్లు పోలీసులు గుర్తించారు.
అధికారుల అభినందన
ఈ కేసును శాస్త్రీయ దర్యాప్తు, సీసీటీవీ విశ్లేషణ, సాంకేతిక ఆధారాలతో ఛేదించిన టౌన్ సీఐ బి. నరహరి, ఏఎస్ఐ రంగారావు, పీసీలు కమలాకర్, రామస్వామి, సంపత్, రాజు లను జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS ప్రత్యేకంగా అభినందించారు.
కొత్త పరిచయాలతో ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లవద్దని, కూలి పనులకు వెళ్లేవారు తమ వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద విషయాలు ఉంటే డయల్ 112 కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Post a Comment