బాన్సువాడలో ఓటర్ల ముసాయిదా జాబితాపై అఖిల పక్ష సమావేశం
గ్రామ సభలను విజయవంతం చేయాలి : ఆర్డీఓ రవీందర్ రెడ్డి
బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల ముసాయిదా జాబితాపై బుధవారం సమావేశం నిర్వహించారు.
ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ అనంతరం ప్రస్తుతం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,76,449 కు చేరిందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 254 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఓటర్ల ముసాయిదా జాబితాను ఇప్పటికే ప్రకటించామని, నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో డ్రాఫ్ట్ జాబితాను ప్రదర్శనకు ఉంచామని తెలిపారు. ప్రస్తుతం నోటీసులు జారీ చేయడంతో పాటు గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఓటర్ల పేర్లు, వివరాల్లో ఏవైనా తప్పులు, అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత బీఎల్ఓ లేదా తహసీల్దార్ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేరు తొలగింపులు, ఇతర సవరణల కోసం ఫారం-6, ఫారం-7, ఫారం-8 లను స్వీకరిస్తున్నామని తెలిపారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు తప్పనిసరిగా డిక్లరేషన్ ఫారంతో పాటు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సమావేశంలో తహసీల్దార్ రాజ నరేందర్ గౌడ్, కౌన్సిలర్లు ఖాలేక్, చంద్రశేఖర్, కో-ఆప్షన్ సభ్యులు ముజ్జు, మహ్మద్ గౌస్, బీజేపీ నేత శంకర్ గౌడ్, బీఆర్ఎస్ నేత రమేష్ యాదవ్, టీడీపీ నేత షంషుద్దీన్, ఎంఐఎం నేత లాయక్, ఆర్ఐ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment