'కల్యాణలక్ష్మి' బకాయిలు చెల్లించాలని బాన్సువాడలో బీఆర్ఎస్ నిరసన
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
మూడు మండలాల్లో 896 మందికి తులం బంగారం బకాయి - రూ.15 కోట్లు
రేవంత్ రెడ్డి పాత రికార్డింగ్ ప్రజలకు వినిపించిన బాజిరెడ్డి
పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ, ఆర్డిఓకు వినతిపత్రం
బాన్సువాడ: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం బాన్సువాడలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, ఆసరా పింఛన్లు వంటి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రూ.2 వేలకు పెంచుతామన్న ఆసరా పింఛన్లు ఇప్పటికీ ఇవ్వలేదని, రూ.4 వేల పింఛన్ హామీ కూడా కాగితాలకే పరిమితమైందని విమర్శించారు.
కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కంటివెలుగు వంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ, 15 వేల రైతుబంధు అమలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. దళితులు, బీసీలు, మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు భయపడొద్దని బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డితో చేతులు కలిపి కాంగ్రెస్లో చేరారని, ప్రస్తుతం మళ్లీ కేసీఆర్ను పొగుడుతున్నారని విమర్శించారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టడం సరికాదన్నారు. ఆయన మాటలు ప్రజలు వినే పరిస్థితిలో లేరని అన్నారు.
రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ రేవంత్ రెడ్డి బందు చేస్తారని, సంక్షేమ పథకాల కోసం టీఆర్ఎస్ శ్రేణులు పోరాటం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. (వీడియోలు 👇)
నియోజకవర్గంలో 896 మందికి తులం బంగారం బకాయి - రూ.15 కోట్లు
బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూరు మండలాల్లో కలిపి మొత్తం 896 మందికి తులం బంగారం ఇవ్వాల్సి ఉందని, 500 దరఖాస్తులు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని బాజిరెడ్డి తెలిపారు.
రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 896 తులాల బంగారం అంటే సుమారు 15 కోట్ల రూపాయల బంగారాన్ని ప్రభుత్వం బకాయి పెట్టిందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని, ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసి నిరుపేదలకు అందే విధంగా చేయాలని డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సభ్యత్వ నమోదు ఇంచార్జ్ తోట ఆగన్న మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాల ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించిందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి పాత రికార్డింగ్ ప్రజలకు వినిపించిన బాజిరెడ్డి
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం లేదా లక్ష రూపాయల నిధులు ఇస్తానని చెప్పిన రికార్డింగ్ను ప్రజలకు మైక్ ద్వారా బాజిరెడ్డి వినిపించారు.
బాన్సువాడ నియోజకవర్గంలో వరి పంట అధికంగా పండుతుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకుండా చేతులెత్తేస్తోందని ఆరోపించారు. చివరకు రైతులు దళారులకే అమ్మకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ ప్రైవేటు వ్యక్తులు రైతుల పంట కొనకుండా కట్టడి చేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, లేకుంటే మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ, ఆర్డిఓకు వినతిపత్రం
అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, యువ నేత మోరిల్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కొర్రి పెట్టి నిరుపేదలకు అన్యాయం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిరుపేదలకు అండగా ఉంటుందని, కార్యకర్తలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు నార్ల రత్నకుమార్, షేక్ జుబేర్, షేక్ అక్బర్, బాడీ శ్రీనివాస్, ఇసాక్, ఫిరోజ్, ఖలీల్, రమేష్ యాదవ్, మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, సాయిబాబా తో పాటు కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











Post a Comment