Top News

PSR NZSR Visit | రైతుల కోరిక మేరకు ఖరీఫ్ పంటకు నిజాంసాగర్ నీళ్లు

రైతుల కోరిక మేరకు ఖరీఫ్ పంటకు నిజాంసాగర్ నీళ్లు  

ప్రాజెక్టులో 12.284 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది  

పొదుపుగా సాగునీరు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పోచారం పిలుపు

నిజాంసాగర్, ఆగస్టు 20: రైతుల విజ్ఞప్తి మేరకు ఖరీఫ్ పంటకు అవసరమైన సాగునీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.

గురువారం ఆయన నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులోని ప్రస్తుత నీటి నిల్వ వివరాలను ప్రాజెక్టు డీఈ  ప్రవీణ్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1400.84 అడుగుల నీటిమట్టంతో 12.284 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని అధికారులు వివరించారు.

నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఇప్పటికే వరి నాట్లు వేసుకున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఖరీఫ్ పంట సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పోచారం గారు వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సాగునీటిని వృథా చేయకుండా, పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పంటలను కాపాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

ప్రాజెక్టు పరిధిలో సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి బాన్సువాడ నియోజకవర్గ రైతుల పక్షాన పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే బాన్సువాడ నియోజకవర్గంలోని నాన్-కమాండింగ్ ఏరియాలకు సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ రివైజ్డ్ శాంక్షన్‌కు అంగీకారం తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ, నిజాంసాగర్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.







Post a Comment

Previous Post Next Post