Top News

Traffice Police | కామారెడ్డిలో ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయోగం

కామారెడ్డిలో ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయోగం 

చలాన్లకు బదులు రాఖీలు - హెల్మెట్ పై సరికొత్త సందేశం

కామారెడ్డి, ఆగస్టు 28 (TDN): రాఖీ పండుగ రోజు కామారెడ్డి వీధుల్లో వాహనదారులకు ఊహించని అనుభవం ఎదురైంది. హెల్మెట్ లేకుండా వచ్చినందుకు చలానా రాస్తారనుకుంటే... మహిళా కానిస్టేబుల్ ఎదురొచ్చి బొట్టు పెట్టి రాఖీ కట్టింది.

"అన్నా... హెల్మెట్ పెట్టుకో, నీ కుటుంబం నీ కోసం చూస్తోంది" అనే ఒక్క మాటతో అక్కడే వాహనదారుల మనసు మారిపోయింది.

శుక్రవారం కామారెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఆలోచనతో ఈ కార్యక్రమం జరిగింది. డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ నరహరి, ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్, వినయ్ సాగర్ లు ప్లాన్ చేశారు.

సాధారణంగా లాఠీ, చలానా బుక్ తో కనిపించే పోలీసులు.. రాఖీలు, కుంకుమతో కనిపించడంతో వాహనదారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చాలామంది సిగ్గుతో తలదించుకుని "అక్కా.. ఇక నుండి తప్పకుండా హెల్మెట్ పెడతా" అని మాట ఇచ్చారు.

ఎస్పీ కామెంట్:

జరిమానా వేస్తే భయం ఒక్కరోజే ఉంటుంది, అనుబంధంతో చెబితే జీవితాంతం గుర్తుంటుంది. అందుకే "రాఖీ బంధం - భద్రతా బంధం" పేరుతో ఈ కార్యక్రమం చేశామని ఎస్పీ తెలిపారు. హెల్మెట్ లేకపోతే ప్రమాదంలో తలకు దెబ్బ తగిలి ప్రాణాలు పోయే ప్రమాదం 70% ఎక్కువ ఉంటుందని పోలీసులు గణాంకాలతో వివరించారు.




Post a Comment

Previous Post Next Post