అన్నదాతపై అధికారి ప్రతాపం...!
"యూరియా ఎప్పుడు వస్తుంది?" అని అడిగినందుకు బూతుల వర్షం!!
వ్యవసాయ అధికారి ఆడియో వైరల్
కామారెడ్డి: "అన్నదాత" సుఖీభవ అనాల్సిన అధికారులే.. అడ్డగోలు బూతులతో రెచ్చిపోతున్నారు. కష్టాలొచ్చి సాయం కోసమో, సమాచారం కోసమో ఫోన్ చేస్తే.. బూతులు తిడుతూ దౌర్జన్యానికి దిగుతున్నారు. కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన తాజా ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
అసలేం జరిగింది?
సాగు పనుల వేళ యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. తెల్లారకముందే సొసైటీల ముందు క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు. సరిగ్గా ఇదే సమస్యపై గాంధారి మండలానికి చెందిన ఓ నిస్సహాయ రైతు.. మండల వ్యవసాయాధికారి (AO) కు ఫోన్ చేసి, "సార్.. యూరియా ఎప్పుడు వస్తుంది?" అని అమాయకంగా ప్రశ్నించాడు.
అంతే! ఆ మాత్రం దానికే ఆ అధికారికి తీవ్ర ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒళ్లు మండిన ఆ అధికారి పద్ధతి మార్చుకుని సమాధానం చెప్పాల్సింది పోయి.. రౌడీలా రెచ్చిపోయాడు.
ఆడియోలో ఏముంది? (వైరల్ మాటలు)
ఏఓ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది:
"నాకు ఆదివారం ఫోన్ చేస్తావా? నాన్సెన్స్.. యూజ్ లెస్ ఫెలో.. బ్లడీ ఫెలో.. నువ్వు ఎప్పుడు ఫోన్ చేయాలో తెలియదా? రాత్రి ఫోన్ చేసి కథలు పడుతున్నావా? రేపు రా నీ సంగతి చెప్తా!" అంటూ ఇష్టానుసారంగా దూషించారు.
మధ్యం మత్తులో ఉన్నారేమో అనేలా ఆయన మాట్లాడిన తీరు రైతన్నలను తీవ్రంగా కలచివేసింది. "సార్.. కొంచెం మంచిగా మాట్లాడండి" అని రైతు ఎంత బతిమాలాడినా, ఆ అధికారి అహంకారం తగ్గకపోవడం గమనార్హం.
భగ్గుమన్న రైతు సంఘాలు.. కలెక్టర్ సీరియస్!
- తీవ్ర నిరసన: అన్నదాతలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యతగల అధికారి ఇలా బూతులు తిట్టడంపై రైతు సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
- సస్పెన్షన్‌కు డిమాండ్: తక్షణమే గాంధారి ఏఓను సర్వీస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నాయి.
- కలెక్టర్ విచారణ: ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. వైరల్ అవుతున్న ఆడియోను పరిశీలించి, త్వరలోనే సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
పంట పొలాలకు నీళ్లు, ఎరువులు అందక రైతన్న ఇప్పటికే సతమతమవుతుంటే.. అధికారుల ఇలాంటి అహంకారపూరిత ప్రవర్తన మరింత క్షోభను మిగులుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రజల పట్ల, ముఖ్యంగా అన్నదాతల పట్ల ఇలా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Post a Comment