పకడ్బందీ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం
కామారెడ్డి, సెప్టెంబర్ 16: కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముందుగా ట్రాఫిక్ గణపతిని దర్శించుకున్న అనంతరం అధికారులు, మున్సిపల్ చైర్ పర్సన్, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన రూట్ ను పరిశీలించారు.
ఓల్డ్ బస్టాండ్ - ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి బాంబే క్లాత్, పాన్ చౌరస్తా, బడా మసీద్, రైల్వే ఫ్లైఓవర్, నిజాంసాగర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదుగా టేకిర్యాల్ చెరువు వరకు ఉన్న మార్గాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్, రహదారులు, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, బారికేడ్లు, అత్యవసర మార్గాలపై ఆరా తీశారు. లోపాలను నిమజ్జనానికి ముందే సరిచేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ - పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ - నిమజ్జన సమయంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా ఉంటుందన్నారు.
డీజేలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. అధిక శబ్దం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు ఇబ్బంది పడతారని, నిబంధనల ప్రకారం డీజేలపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీ మధుసూదన్, టౌన్ ఎస్హెచ్ఓ నరహరి, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, చైర్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు.









Post a Comment