చాకచక్యంగా అడ్డుకున్న కామారెడ్డి పోలీసులు
కామారెడ్డి, సెప్టెంబర్ 04: మద్యం మత్తులో భార్యతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కామారెడ్డి పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. నలుగురి ప్రాణాలు కాపాడిన లింగంపేట బ్లూకోట్స్, PCR, సదాశివనగర్ పెట్రోలింగ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు.
ఘటన వివరాలు:
కమ్మర్ పల్లికి చెందిన చిత్తారి రాజు ప్రస్తుతం లింగంపేటలో పాత ఇనుప సామాను వ్యాపారం చేస్తున్నాడు. సెప్టెంబర్ 03 అర్ధరాత్రి మద్యం సేవించి భార్యతో గొడవపడిన రాజు ఆవేశంలో తన ముగ్గురు చిన్నారులను తీసుకుని చనిపోతాను అంటూ టాటా ఏస్ వాహనంలో ఇంటి నుండి బయలుదేరాడు.
విషయాన్ని గమనించిన లింగంపేట బ్లూకోట్స్ సిబ్బంది వెంటనే PCRకు సమాచారం అందించారు. PCR నుండి సమాచారం అందుకున్న సదాశివనగర్ పెట్రోలింగ్ ASI జగదీష్ అప్రమత్తమై ప్రధాన రహదారులపై గాలింపు చేపట్టి వేగంగా వెళ్తున్న టాటా ఏస్ ను అడ్డుకున్నారు. వాహనంలో తండ్రీ పిల్లలను గుర్తించి లింగంపేట పోలీసుల సహకారంతో కౌన్సెలింగ్ ఇచ్చి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఎస్పీ ప్రశంసలు:
ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆవేశంలో ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి ప్రాణం విలువైనది. ఆపదలో పోలీసులను సంప్రదించండి అని సూచించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బంది తీరు అభినందనీయమన్నారు.

Post a Comment