ఘనంగా 11వ ఆయుర్వేద దినోత్సవం - బాన్సువాడలో వేడుకలు
ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం - వన్ హెల్త్ వన్ ఫ్యూచర్
బాన్సువాడ, సెప్టెంబర్ 23: భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర ఆయుష్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశాల మేరకు బాన్సువాడ ఆయుష్ విభాగం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, ప్రభుత్వ యునాని వైద్యశాల ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆయుర్వేద వారోత్సవాల ముగింపుగా బుధవారం యోగా కేంద్రంలో ఉదయం యోగా అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా శిక్షకులు వొట్లం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23ను అధికారికంగా స్థిరమైన తేదీగా కేటాయించిందని, ఈ రోజున పగలు రాత్రి సమానంగా ఉండి ప్రకృతి సమతుల్యతను కలిగి ఉంటుందన్నారు. ఈ సంవత్సర అధికారిక థీమ్ "ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం" అని, ట్యాగ్ లైన్ "వన్ హెల్త్ వన్ ఫ్యూచర్" అని తెలిపారు. యోగా, ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆధునిక వైద్యంతో పాటు ఉపయోగించడం ద్వారా ప్రయోజనాలు పొందాలని సూచించారు.
పిల్లల వైద్యులు డా. ప్రకాష్ మాట్లాడుతూ మెరుగైన ఆరోగ్యం కోసం సమీకృత ఆధునిక వైద్యంతో పాటు ఆయుర్వేద వైద్యాన్ని స్వీకరించాలని, ప్రకృతితో మమేకమై జీవిస్తూ కాలానుగుణ ఆహార అలవాట్లపై దృష్టి సారించి పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరు స్వీకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఆసుపత్రి RMO డా. సుజాత, హెడ్ నర్స్ అమృతలత, ఆత్మ కమిటీ చైర్మన్ మాసాని రవీందర్ రెడ్డి, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, సుల్తానా గౌస్, అశోక్ రెడ్డి, షోయబ్, అన్వర్, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.



Post a Comment