రైతుల పొలాల్లో బోర్ మోటార్ల తీగల చోరీ!
బీర్కూర్ పోలీసుల అదుపులో ఇద్దరుదొంగలు
బీర్కూర్ : పంటలకు నీరు పెట్టుకుందామంటే మోటార్లు పనిచేయడం లేదని రైతులు ఆందోళన చెందుతున్న వేళ, ఆ చోరీ వెనుక ఉన్న దొంగలను బీర్కూర్ పోలీసులు పట్టుకున్నారు.
ఎస్ఐ రాములు వెల్లడించిన వివరాల ప్రకారం, వీరాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు దుండగులు ఈ నెల 16వ తేదీన ఒకే రాత్రిలో 11 మంది రైతులకు చెందిన 21 బోరు బావుల వద్ద నుంచి 285 మీటర్ల రాగి తీగను కోసుకెళ్లారు. దీని విలువ దాదాపు రూ.40 వేలు ఉంటుంది.
దొంగిలించిన తీగను రుద్రూర్ లోని స్క్రాప్ కొట్టులో అమ్మేశారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో ఈ నెల 19న తిమ్మాపూర్ నుంచి రుద్రూర్ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు బైకుపై తీగల మూటతో వెళ్తుండటం చూసి అనుమానంతో ఆపి విచారించారు. విచారణలో అసలు విషయం బయటపడింది. తామే తీగల చోరీకి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఎస్ఐ తెలిపారు.

Post a Comment